జగన్‌ ఆకాశానికెత్తేసిన కొడాలి నాని

అలాంటి నేత గతంలో లేడు, భవిష్యత్తులో రాడు

kodali nani
kodali nani

అమరావతి: ఏపి మంత్రి కొడాలి నాని ఈరోజు మీడియా సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవస్థలన్నీ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని రాజ్యాంగంలో ఉందని, కానీ కొన్ని వ్యవస్థలను వాటిలోని లొసుగుల ఆధారంగా కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసంగా అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. తమ మాటే వినాలని, తాము చెప్పిందే పాటించాలని, భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలను తాము ఏమైనా చేయగలమని కొన్ని వ్యవస్థలు అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి వ్యవస్థలపై దమ్ము, ధైర్యంతో స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

జగన్ సిఎంగా వచ్చాక జరుగుతున్న కొన్ని పరిణామాలు రాష్ట్ర ప్రజలకే కాకుండా, దేశ ప్రజలకు కూడా అనుమానాలు కలిగిస్తున్నాయని తెలిపారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, రాజధాని ప్రకటన రాకముందే చంద్రబాబు బినామీలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని, దీనిపై సిఎం జగన్ చిత్తశుద్ధితో విచారణకు ఆదేశించారని తెలిపారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందించకపోవడంతో సీఎం జగన్ స్వయంగా సిట్, సీఐడీ విచారణకు ఆదేశించాల్సి వచ్చిందని వివరించారు. కానీ టిడిపి నేతలు ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు వేసి అడుగడుగునా అడ్డంపడుతున్నారని, పార్లమెంటులోనూ ఇద్దరు ముగ్గురు ఎంపీలను అడ్డంపెట్టుకుని ఆటంకాలు సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సిఎం జగన్ దమ్ము, ధైర్యంతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా సిఎం జగన్ ను కొడాలి నాని ఆకాశానికెత్తేశారు. ఎదుటివారు ఎంతటి వాళ్లయినా ఢీకొట్టే దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు జగన్ అని, జగన్ వంటి నేత గతంలో లేడని, ఇకముందు వస్తాడో రాడో తెలియదని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/