ప్రేమ‌కు, వివాహ బంధానికి సీతారాములే నిద‌ర్శ‌నం: జావెద్ అక్త‌ర్‌

‘Jai Siya Ram’ Finest Example Of Love And Unity.. Javed Akhtar

ముంబయి: ప్రేమ‌కు, వివాహ బంధానికి సీతారాములే నిద‌ర్శ‌మ‌ని, ఆద‌ర్శ దంపతులు అని చెప్ప‌డానికి ఆ జంటే ఉత్త‌మ‌మైంద‌ని బాలీవుడ్ గేయ ర‌చ‌యిత జావెద్ అక్త‌ర్ తెలిపారు. ముంబయిలో మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేనా చీఫ్ రాజ్ థాక‌రే నిర్వ‌హించిన దీపోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అక్త‌ర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. మ‌తం, రాజ‌కీయాల‌పై త‌న అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పే జావెద్ అక్త‌ర్‌.. సీతారాముల జంట‌ గురించి అద్భుతమైన విష‌యాల‌ను తెలిపారు.

ఎంతో మంది దేవుళ్లు ఉన్నార‌ని, కానీ ఆద‌ర్శ‌వంత‌మైన భార్యాభ‌ర్త‌ల గురించి చెప్పిన‌ప్పుడు, మ‌న మెద‌ళ్ల‌లోకి సీతారాములే గుర్తుకు వ‌స్తార‌ని, ప్రేమ‌ బంధానికి ఇంత‌క‌న్నా గొప్ప ఉదాహ‌ర‌ణ ఏదీ లేద‌ని అక్త‌ర్ తెలిపారు. హిందూ మ‌తంలో ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్య‌త‌ను ఆయ‌న తెలిపారు. హిందువుల్లో స‌హ‌న‌శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. హిందువుల్లో క‌రుణ‌ ఎక్కువ అని, పెద్ద మ‌న‌సుతో వ్య‌వ‌హ‌రిస్తార‌ని అన్నారు. హిందూ మ‌త‌మే ప్ర‌జాస్వామ్య విలువ‌ల్ని నేర్పింద‌ని, అందుకే ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం బ్ర‌తికి ఉంద‌న్నారు. మ‌న‌మే క‌రెక్టు, మిగితావాళ్లంతా త‌ప్పు అన్న భావ‌న హిందువుల్లో ఉండ‌ద‌న్నారు. రాముడు, సీత కేవ‌లం దేవుళ్లు మాత్ర‌మే కాదు అని, భార‌తీయ సాంస్కృతిక వార‌స‌త్వానికి ప్ర‌తీక‌లు అని జావెద్ అక్త‌ర్ తెలిపారు.