నేటి నుంచి పూరిలో జగన్నాథ రథ యాత్ర

తొమ్మిది రోజుల పాటు జరగనున్న యాత్ర

ratha-yatra-of-lord-jagannath-set-to-begin-today

పూరి: నేడు ఒడిశాలోని పూరిలో జ‌గ‌న్నాథ యాత్రలో భాగంగా ప‌హండి ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. రెండేళ్ల త‌ర్వాత ర‌థ‌యాత్ర కోసం భ‌క్తుల‌కు అనుమ‌తి ఇచ్చారు. మూడు ర‌థాల‌ను స‌ర్వాంగ సుంద‌రంగా అల‌క‌రించారు. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు పూరి చేరుకున్నారు. జ‌గ‌న్నాథుడు, బ‌ల‌బ‌ద్రుడు, సుభ‌ద్రా ర‌థాలు యాత్ర కోసం సిద్దం అయ్యాయి. పహండిలో భాగంగా బ‌ల‌భ‌ద్రుడు చెక్క విగ్ర‌హాన్ని త‌ల‌ద్వాజ ర‌థం వ‌ద్ద‌కు తీసుకువెళ్లారు. బ‌ల‌భ‌ద్రుడి త‌ర్వాత దేవి సుభ‌ద్ర విగ్ర‌హాన్ని దేబ‌ద‌ల‌న ర‌థం వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. పూరి శ్రీమందిరం నుంచి భ‌గ‌వాన్ జ‌గన్నాథుడి విగ్ర‌హాన్ని అత్యంత శోభాయ‌మానంగా అల‌క‌రించిన నందిఘోష ర‌థం వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు మ‌రికాసేప‌ట్లో మూడు ర‌థాల‌ను హ‌రినామ స్మ‌ర‌ణ‌ల మ‌ధ్య లాగ‌నున్నారు.

ఈ క్షేత్రంలో ఏటా జరిగే జగన్నాథుడి రథయాత్రకు ఎంతో విశిష్టత వుంది. ప్రతి ఏడాది జరిగే యాత్ర మహోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది రథయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే వేలాదిగా భక్తులు పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకున్నారు. ఈ యాత్ర తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. సోదరుడు భలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు రథయాత్రతో భక్తులకు దర్శనం ఇస్తాడు.

రెండు సంవత్సరాల తర్వాత ఈ యాత్రకు పూర్తి స్థాయి భక్తులను అనుమతిస్తున్నారు. దాంతో, ఒడిశా అంతటా భక్తుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లు రథయాత్రకు భక్తులను అనుతించలేదు. రెండేళ్ల విరామం తర్వాత రథయాత్రలో పాల్గొనేందుకు ప్రజలను అనుమతించడంతో సుమారు 10 లక్షల మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర మతాల వారు, జగన్నాథ ఆలయంలోకి ప్రవేశం లేని విదేశీయులు కూడా త్రిమూర్తుల దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఒక అధికారి తెలిపారు. రథయాత్ర సజావుగా సాగేందుకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పూరీ, చుట్టుపక్కల వెయ్యి మంది పోలీసులను, 180 ప్లాటూన్ల సాయుధ బలగాలను మోహరించారు. పూరీలోని గ్రాండ్ రోడ్, ఇతర ప్రదేశాలలో దాదాపు 50 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/