బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్ల ఎత్తివేత

బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లను ఎత్తేవేసారు. నేటి నుండి అక్టోబర్ నెల వరకు గేట్లను తెరిచి ఉంటాయి. మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఎత్తివేశారు. సీడబ్ల్యూసీ అధికారుల పర్యవేక్షణలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు గేట్లను ఎత్తేసారు. ఎస్సారెస్పీకి 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ సమీపంలో బాబ్లీ ప్రాజెక్టును నిర్మించారు. దీంతో ఎస్సారెస్పీకి వచ్చే వరదకు అడ్డుకట్ట పడిందని, ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారే అవకాశముందంటూ గత ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రతిఏటా జూలై 1 నుంచి అక్టోబర్‌ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు శుక్రవారం గేట్లు ఎత్తేసారు. బాబ్లీ గేట్ల ఎత్తివేత, మూసివేత ప్రక్రియలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర అధికారులతో పాటు సీడబ్ల్యూసీ (సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌) అధికారులు పాల్గొని సుప్రీం తీర్పును అమలు చేసారు. దీంతో జిల్లాలోని గోదావరి నదిలోకి వదర ప్రవాహం పోటెత్తింది. ఈ క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది.