రమ్య హత్య కేసు తీర్పు ను స్వాగతించిన జగన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన‌ బీటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసులో గుంటూరు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నానని సీఎం జగన్ అన్నారు. ఈ కేసు విషయంలో పోలీస్ శాఖ వేగంగా దర్యాప్తు పూర్తి చేసిందని కితాబిచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీస్ శాఖకు అభినందనలు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

గ‌తేడాది ఆగ‌స్టు 15వ తేదీన ప‌ట్ట‌ప‌గ‌లే నడిరోడ్డుపై రమ్యను కుంచాల శ‌శికృష్ణ అనే యువ‌కుడు అత్యంత‌ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో 9 నెల‌ల పాటు విచార‌ణ కొన‌సాగించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. నిందితుడికి ఈరోజు ఉరి శిక్ష‌ను ఖరారు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల ర‌మ్య కుటుంబ స‌భ్యులు హర్షం వ్యక్తం చేసారు. నిందితుడికి స‌రైన శిక్ష పడిందని, త‌మ బిడ్డ ఆత్మ‌కు శాంతి చేకూరేలా కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు.