ఏపీలో స్థానిక సంస్థల తాలూకా ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుదల

ఏపీలో మరోసారి ఎన్నికల హడావిడి మొదలుకాబోతుంది. రాష్ట్రంలో చాన్నాళ్లుగా నిలిచిపోయిన పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎంపికకు ముహూర్తం ఫిక్స్ చేసారు. రాష్ట్రంలోని 5 జిల్లాల్లోని 5 వేర్వేరు మండల పరిషత్‌లకు అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఆయా మండ‌ల ప‌రిష‌త్‌, గ్రామ పంచాయ‌తీల్లో వ‌చ్చే నెల 5న ఎన్నిక జ‌ర‌గ‌నున్నట్లు పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్ర‌కారం ఏపీలోని ప‌లు జిల్లాల‌కు చెందిన న‌ర‌సాపురం, పెద‌కూర‌పాడు, ఉంగుటూరు, పొద‌ల‌కూరు మండ‌ల ప‌రిష‌త్‌లకు సంబంధించి మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షుల‌తో పాటు మండ‌ల ప‌రిష‌త్ ఉపాధ్య‌క్ష ప‌ద‌వుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కోన‌సీమ జిల్లాకు చెందిన రాయ‌వ‌రం మండ‌ల ప‌రిష‌త్‌కు సంబంధించి ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి కూడా ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అదే మాదిరిగా 26 పంచాయ‌తీల్లో ఉప స‌ర్పంచ్ ఎన్నిక‌లు కూడా మే 5నే జ‌ర‌గ‌నున్నాయి. మే 5వ తేదీన ఉదయం 11 గంటలకు మండల పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికతో పాటు ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎస్‌ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.