కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్

చదువుతోనే పేద కుటుంబాల తలరాతలు మారుతాయని.. ప్రతి త్రైమాసికం పూర్తయిన వెంటనే వైస్సార్ కళ్యాణమస్తు, వైయస్‌ఆర్‌ షాదీ తోఫా సాయం విడుదల చేస్తున్నామని, నేడు ఐదో విడతగా 10,132 జంటలకు మంచి జరిగిస్తూ రూ.78.53 కోట్లు అందిస్తున్నామని ముఖమంత్రి జగన్ అన్నారు. అక్టోబర్‌–డిసెంబర్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 10,132 జంటలకు రూ.78.53 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి సీఎం జగన్‌ విడుదల చేశారు. అంతకుముందు వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకంలోని నిబంధనల వల్ల జరుగుతున్న మేలు, చదువుల కోసం అమలు చేస్తున్న పథకాలు ఇస్తున్న ఫలితాల గురించి సీఎం జగన్‌ మాట్లాడారు.

దేవుడి దయవల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. పేద పిల్లల చదువులను ప్రోత్సహించే క్రమంలో వరుడు, వధువు ఇద్దరూ కూడా పదో తరగతి చదివి ఉండాలనే నిబంధన విధించామని చెప్పారు. మన తలరాత, భవిష్యత్తు మార్చే శక్తి చదువుకు ఉందని అన్నారు. మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతిలోనే ఉందని చెప్పారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని జగన్ అన్నారు.