అనంతపురం జిల్లాలో ఘోరం : రెండు నెలల చిన్నారిని చంపిన తండ్రి

అనంతపురం జిల్లాలో ఘోరం : రెండు నెలల చిన్నారిని చంపిన తండ్రి

కన్న తండ్రి కసాయిగా మారాడు..అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారిని అతి దారుణంగా చంపేసిన ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లికార్జున, చెట్టెమ్మలకు రెండు నెలల చిన్నారి ఉంది. కొద్దీ రోజులుగా చిన్నారి ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. దీంతో తరుచు ఆ పాపను హాస్పటల్ కు తీసుకెళ్తున్నారు. గురువారం సాయంత్రం చిన్నారిని హాస్పిటల్ కు తీసుకెళ్ళారు దంపతులు. భార్యను ఆస్పత్రి దగ్గర ఉండమని చెప్పి చిన్నారిని తీసుకొని భర్త బయటకు వెళ్ళాడు, ఆలా బయటకు తీసుకెళ్లిన భర్త..ఎంత సేపైనా తిరిగి రాలేదు. నాలుగు గంటలైన చిన్నారి జాడ తెలియలేదు. భర్తపై అనుమానం వచ్చిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి, తండ్రి జాడ గురించి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఐదుకల్లు గ్రామానికి వెళ్లే రహదారి లో చిన్నారి కోసం వెతకడం మొదలు పెట్టారు. ఆ చిన్నారిని తీసుకెళ్లినపుడు ఉన్న టవల్ తదితర వస్తువులు పక్కనే ఉన్న చెరువు దగ్గర లభ్యం అయ్యాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి చెరువులో గాలింపు చేపట్టగా చిన్నారి మృతదేహం ఒక గోనెసంచిలో లభ్యం అయింది. ఆ మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని చూసిన తల్లి బోరున విలపించింది. ఈ ఘోరానికి పాల్పడిన తండ్రిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. నిందితుడు మల్లికార్జునను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.