బీ ఫారం అందుకున్న మేకపాటి విక్రమ్‌ రెడ్డి

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌ రెడ్డి బీ ఫారం అందుకున్నారు. బుధువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో విక్రమ్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా మేకపాటి విక్రమ్‌ రెడ్డి బీ ఫారం అందుకున్నారు. దీంతో రేపు అన‌గా జూన్ 2వ తేదీన విక్ర‌మ్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.

ఈ భేటీలో విక్ర‌మ్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి పాల్గొన్నారు. జ‌గ‌న్ కేబినెట్‌లో ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ప‌నిచేస్తూ ఈ మ‌ధ్య‌నే గుండెపోటుతో చ‌నిపోయిన‌ మేక‌పాటి గౌతం రెడ్డి మృతితో ఆత్మ‌కూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ స్థానానికి పార్టీ అభ్య‌ర్థిగా గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు విక్ర‌మ్ రెడ్డికి అవ‌కాశం క‌ల్పించాల‌ని మేక‌పాటి ఫ్యామిలీ జ‌గ‌న్‌ను కోరింది. ఆ మేర‌కే విక్ర‌మ్ రెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని జ‌గ‌న్ ఖ‌రారు చేశారు.