వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తేదీలు ఖరారు

వైస్సార్సీపీ అధినేత , సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తేదీలను ఫిక్స్ చేసారు. జూలై 8, 9న ప్లీనరీ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వద్ద ప్లీనరీని నిర్వహిస్తామని పార్టీ తెలిపింది. ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టింది. ప్లినరీకి సంబంధించి పార్టీ నేతలు,కార్యకర్తలకు,అతిధులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్లీనరీ నిర్వహణ కమిటీలను ఏర్పాటుచేస్తున్నాము. జులై 8 వతేదీన ప్రారంభమై 9 వతేదీ సాయంత్రం వరకు ప్లీనరీ కొనసాగుతుందని అన్నారు.పార్టీ నేతలందరూ ప్లీనరీకి సమాయత్తం కావాలని కోరారు. రెండు సంవత్సరాలలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేవిధంగా అందరూ సమష్టిగా పనిచేయాలనేది ముఖ్యమంత్రి జగన్ ప్రధాన ఉధ్దేశ్యం అని అన్నారు నేతలు. పార్టీ నేతలకు సంబంధించి ఎక్కడైనా చిన్నపాటి విభేదాలున్నప్పటికి వాటిని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకు నడవాలన్నారు.

రీసెంట్ గా దావోస్‌ పర్యటన నుండి వచ్చిన సీఎం జగన్‌ ..వచ్చీ రావడమే రాష్ట్ర పరిస్థితులపై తన సన్నిహితులతో ఆరా తీశారు. పార్టీ ముఖ్యుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం, మంత్రుల బస్సు యాత్ర పైన సీఎం ఆరా తీసారు. ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించాలని సీఎం జగన్‌ పార్టీ ముఖ్యులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తెలుగుదేశం మహానాడుకు మూడింతలమేర విజయవంతం కావాలన్న తన అభిప్రాయాన్ని సూటిగా, స్పష్టంగా, నిష్కర్షగా పార్టీ ముఖ్యులకు తెలిపారు. దీంతో ఇప్పుడు అధికార వైకాపాలో ప్లీనరీ ఫీవర్‌ ప్రారంభమైంది. ఇక రేపు గురువారం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ఖరారైంది.

గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి 11:30 గంటలకు హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వన్‌ జనపద్‌కు చేరుకోనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి జగన్ చర్చించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా పెండింగ్‌ ప్రాజెక్టులు, పోలవరానికి నిధులు, తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉంది.