వైఎస్సార్‌సీపీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సస్పెన్షన్‌

వైఎస్సార్‌సీపీ అధిష్టానం పార్టీ నుండి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్‌ చేసింది. ‘పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమైనదని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది.

కొంతకాలంగా కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయని.. దాంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు సుబ్బారాయుడును సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. మంగళవారం మీడియాతో మాట్లాడిన సుబ్బారాయుడు.. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో నర్సాపురం నుంచి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్న విషయం మాత్రం క్లారిటీ లేదన్నారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని అంటున్నారు.
నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు మంచి ప‌ట్టు ఉంద‌ని.. అన్ని కులాల్లో త‌న‌కు ప‌డే ఓట్లు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు.. నర్సాపురంలో గెలుపు తనదేనన్నారు.

గతంలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత ఉన్న స‌మ‌యంలోనూ నర్సాపురంంలో సొంతగా గెలిచానన్నారు. గత కొద్దీ రోజులుగా నర్సాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి కొత్తపల్లి సబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుల మధ్య వర్గపోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల విషయంలో నర్సాపురంను జిల్లా కేంద్రం చేయడంలో ప్రసాదరాజు విఫలమయ్యారని సుబ్బారాయుడు అన్నారు. ఎమ్మెల్యే ముదునూరి తీరుపై ఆగ్రహంతో తన చెప్పుతో తనను తాను కొట్టుకున్నారు. అప్పుడే వైఎస్సార్‌సీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇటీవల సుబ్బారాయుడికి ప్రభుత్వం గన్‌మెన్లను తొలగించింది. ఇలా వరుస పరిణామాల తర్వాత ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.