ప.గోదావరి జిల్లాలో బస్సు ప్రమాదం : మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

ప.గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. ప్రమాదం పట్ల ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సు.. అశ్వారావు పేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా.. ఒక్కసారిగా
జల్లేరు వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది మరణించినట్లు తెలుస్తుంది. బస్సులో మొత్తం 50 మంది కి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు ఒక్కసారిగా వాగులో పడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు. బస్సు డ్రైవర్ చెన్నారావు స్పాట్ లోనే చనిపోయారని కండక్టర్ రవి చెపుతున్నారు. గాయపడినవారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాగు నుంచి బస్సును వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు బయటకు వస్తేగాని మొత్తం మృతుల సంఖ్య ప్రకటించలేమని అధికారులు తెలిపారు.