బోయిగూడా అగ్నిప్రమాదం.. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎస్ సోమేశ్

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిగూడా స్క్రాప్ గోడౌన్ లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోయిగూడాకు వెళ్లిన సి.ఎస్ సోమేశ్ కుమార్.. అగ్నిమాపక, జీహెచ్ఎంసీ, ఈవీడీఎం బృందాలు చేపట్టిన చర్యలను పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగిన నేపధ్యాన్ని పోలీసు, అగ్నిమాపక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన జరగడం అత్యంత విచారకరమని, ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టనున్నట్టు సి.ఎస్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. మరణించిన మృతదేహాలను బీహార్ లోని వారి స్వస్థలానికి పంపేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.

బోయగూడా నుండి సికిందరాబాద్ గాంధీ హాస్పిటల్ కు వెళ్లి మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించాలని ఆదేశించారు. గుర్తుపట్టకుండా ఉన్న మృతదేహాలను డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి గుర్తించాలని సూచించారు. ఈ ప్రమాద సంఘటన నుండి గాయాలతో బయటపడ్డ వ్యక్తికి అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలూ అందచేయాలని వైద్యులను ఆదేశించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/