టోక్యో విశ్వవిద్యాలయంలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా జాక్‌మా !

Jack Ma to take up Tokyo University visiting professorship

బీజింగ్‌ః చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆగ్రహానికి గురై దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో గడిపిన అలీబాబా వ్యవ‌స్థాప‌కుడు, చైనా కుబేరుడు జాక్‌ మా చాలా కాలం తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి చివరిలో చైనా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కొత్త కెరీర్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ విశ్వవిద్యాలయానికి విజిటింగ్‌ ప్రొఫెసర్‌ గా పనిచేయనున్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

తమ కళాశాలలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌ గా చేరాలని జాక్‌మా ను ఆహ్వానించినట్లు జపాన్‌ లోని టోక్యో విశ్వవిద్యాలయం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జాక్‌మా నియామకం గడువు అక్టోబర్‌ చివరి నాటికి ముగుస్తుందని తెలిపింది. అయితే దీనిని వార్షిక ప్రాతిపదికన పునరుద్ధరించవచ్చని ప్రకటనలో వెల్లడించింది. టోక్యో కళాశాల లో జాక్‌మా ముఖ్యమైన పరిశోధనాంశాలపై సలహాలు ఇవ్వడం, నిర్వహణ, బిజినెస్‌ స్టార్టప్‌లపై విద్యార్థులకు తరగతులు చెప్పడం వంటివి చేయనున్నారు. కాగా, జాక్‌మా పనిచేయనున్న ఈ కళాశాల.. టోక్యో విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ పరిశోధన సంస్థలకు మధ్య ఇంటర్‌ఫేస్‌గా పనిచేసేందుకు 2019లో ఏర్పాటు చేశారు.