హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు

మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ సోదాలు

income tax department
income tax department

హైదరాబాద్‌ః కాంగ్రెస్ నాయకురాలు చిగిరింత పారిజాత ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఉదయం ఐదు గంటల సమయంలో హైదరాబాద్ శివారులోని బాలాపూర్‌లోని ఆమె నివాసంతోపాటు మరో 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలకు దిగారు. ఈ క్రమంలో పారిజాత కుమార్తె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బడంగ్‌పేట్ మేయర్ అయిన పారిజాత ఇల్లుతోపాటు కంపెనీలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలంలో బాలపూర్ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి, మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే, మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, విపక్ష నాయకుల ఇళ్లలో సోదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.