చెంగాలమ్మ ఆలయంలో ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ ప్రత్యేక పూజలు

ISRO Chief Offers Prayers At Chengalamma Temple Ahead Of Aditya-L1 Launch

న్యూఢిల్లీః భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్ షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 14 ప్రయోగం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట లోని చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ సందర్శించారు. శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ చేపట్టబోయే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 14 ప్రయోగం విజయవంతం కావాలని వేడుకున్నారు.

మరోవైపు ఇన్‌శాట్‌-3డీఎస్‌ (INSAT-3DS) వాతావరణ ఉపగ్రహానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 14 వ్యోమనౌక ద్వారా దీన్ని నింగిలోకి పంపనున్నారు. మూడో తరం వాతావరణ ఉపగ్రహమైన ఇన్‌శాట్‌- 3డీఎస్‌ను భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర భూ విజ్ఞాన శాఖ ఈ ఉపగ్రహ ప్రయోగానికి నిధులు సమకూర్చింది.