ఇరాన్‌లో జంట పేలుళ్లు మా పనే..ఉగ్ర సంస్థ ఐఎస్‌ ప్రకటన

‘Islamic State’ claims responsibility for bombings in Iran

టెహ్రాన్: ఇరాన్‌లో జంట పేలుళ్లలో ఇప్పటి వరకు 84 మంది మరణించారు. కెర్మన్‌లో సులేమానీ సమాధివద్ద నివాళులర్పించేందుకు తరలివచ్చిన జన సమూహాన్నే లక్ష్యంగా చేసుకొని పాల్పడ్డ జంట పేలుళ్లులో తొలుత 104 మంది చనిపోయారని వెల్లడించినప్పటికీ ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం 84 మంది మరణించారని ధ్రువీకరించింది. ఘటనా స్థలం కెర్మన్‌.. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు 820 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అయితే ఈ పేలుళ్లకు ఒడిగట్టింది తామేనని ఉగ్ర సంస్థ ఇస్లామిక్‌ స్టేక్‌ గ్రూప్‌ ప్రకటించింది. పేలుళ్లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల పేర్లు (ఒమర్‌-అల్‌ మువాహిద్‌, సేఫుల్లా అల్‌-ముజాహిద్‌), ఫొటోలనూ తమ వార్తాపత్రిక అమఖ్‌ ద్వారా వెల్లడించింది. పేలుళ్లను ఆత్మాహుతి దాడులుగా ఐఎస్‌ పేర్కొంది. ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ సమాధి వద్ద నివాళులర్పించేందుకు బుధవారం భారీగా తరలివచ్చిన జన సమూహంలోకి చొచ్చుకెళ్లి శరీరానికి చుట్టుకున్న బాంబులను వారు ఎలా పేల్చుకున్నారో ఐఎస్ వివరించింది. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ పేలుళ్లు జరగడం అనేక అనుమానాలకు తావిచ్చింది.