ఇంగ్లిష్‌లో మాట్లాడడానికి ఇదేమీ ఇంగ్లండ్ కాదు కదా?: సిఎం నితీశ్‌

గవర్నమెంట్ స్కీమ్స్ బదులు సర్కారీ యోజన అనలేరా? వ్యవసాయ పారిశ్రామికవేత్తపై నితీశ్ కుమార్ ఫైర్

‘Is this England?’: Nitish Kumar reprimands farmer for speaking in English

పాట్నాః ఓ వ్యవసాయ పారిశ్రామికవేత్త ఇంగ్లిష్ అతి వినియోగంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కోపమొచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?.. వ్యవసాయానికి సంబంధించి రాజధాని పాట్నాలోని బాపు సబాగార్ ఆడిటోరియంలో ‘నాలుగో వ్యవసాయ రోడ్‌మ్యాప్’ ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వ్యవసాయ పారిశ్రామికవేత్త అమిత్‌కుమార్.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రశంసిస్తూ ఇంగ్లిష్‌లో ఉపన్యాసం ప్రారంభించారు.

ఆంగ్లంలో ఆయన అన్యాపదేశంగా మాట్లాడుతుండడంతో మధ్యలో కల్పించుకున్న నితీశ్ కుమార్.. ప్రసంగంలో అతిగా ఇంగ్లిష్ పదాలు ఉపయోగిస్తుండడం వల్లే కల్పించుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇంగ్లిష్‌లో మాట్లాడడానికి ఇదేమీ ఇంగ్లండ్ కాదు కదా? అని మండిపడ్డారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న మీరు గవర్నమెంట్ స్కీమ్స్ అన్న పదానికి బదులుగా సర్కారీ యోజన అనలేరా? అని నిలదీశారు. తాను కూడా ఇంగ్లిష్‌లోనే ఇంజినీరింగ్ చదివానని, అది వేరే విషయమని అన్నారు. రోజువారీ కార్యకలాపాలకు ఇంగ్లిష్‌ను ఎందుకు ఉపయోగించాలని సీఎం నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.