రాహుల్ గాంధీ మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నారా…?

అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. రీసెంట్ గా రాహుల్ భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 12 రాష్ట్రాల మీదుగా సాగిన ఈ యాత్రను గతేడాది సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో రాహుల్ ప్రారంభించారు. రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, 75 జిల్లాల మీదుగా 145 రోజులపాటు మొత్తం 4 వేల కిలోమీటర్లకుపైగా రాహుల్‌ పాదయాత్ర సాగింది.

ఈ యాత్ర సక్సెస్ కావడం తో ఇప్పుడు రాహుల్ మరో యాత్ర చేపట్టాలని అనుకుంటున్నారట. ఈసారి పశ్చిమ తీరంలోని గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రం అసోం వరకు పాదయాత్ర చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. ఈ యాత్ర గుజరాత్ లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన పోరుబందర్ లో మొదలై అసోంలో ముగుస్తుందని అంటున్నారు. మహాత్మాగాంధీ జన్మస్థలంగా పోరుబందర్ కు విశేష ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో రాయ్ పూర్ లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశం జరగనుంది. రాహుల్ తాజా పాదయాత్రపై ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ యాత్ర కు సంబదించిన వివరాలు తెలియాల్సి ఉంది.