టర్కీ కి సాయం అందించిన భారత్

శత్రువైన సరే..ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయడం సాటి మనిషి లక్షణం. ఇప్పుడు భారత్ కూడా అదే చేసింది. వైషమ్యాలను మరచి టర్కీ కి ఆపన్న హస్తం అందించింది. టర్కీ, సిరియా దేశాల్లో సోమవారం పెను విషాదం నెలకొంది. ఒకే రోజు మూడు భారీ భూకంపాలతో టర్కీ, సిరియా దేశాలు అల్లాడిపోయాయి. వేలాది భవనాలు నేలమట్టం కాగా, అందులో వేలాదిమంది చిక్కుకొని ప్రాణాలు విడిచారు.

ఈ వరుస భూకంపాల ధాటికి ఈ రెండు దేశాల్లో 2,300 మందికి పైగా మరణించారు. టర్కీలో 1,121 మంది మరణించారని… 5,385 మంది గాయపడ్డారని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ వెల్లడించారు. కాగా పెను విపత్తును ఎదుర్కొనేందుకు టర్కీ అంతర్జాతీయ సాయం కోరగా.. భారత్ వెంటనే స్పందించింది. వంద మంది సిబ్బందితో కూడిన రెండు బెటాలియన్ల ఎన్డీఆర్ఎఫ్ బలగాలతోపాటు.. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్న వారిని గుర్తించే రెండు శునకాలను రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత్ పంపిస్తోంది. ఘజియాబాద్ నుంచి ఒకటి, కోల్‌కతా నుంచి మరొకటి చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కేంద్రం టర్కీకి పంపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ సహయక చర్యల్లో పాల్గొననున్నారు. వీరికి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉందని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ అతుల్ కర్వాల్ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టడం కోసం వారు తగిన శిక్షణ పొంది ఉన్నారని ఆయన తెలిపారు.