తేలిపోయిన యుద్ధమేఘాలు!

Hassan Rouhani and Donald Trump
Hassan Rouhani and Donald Trump

టెహ్రాన్ : అమెరికా, ఇరాన్‌లు పట్టువిడుపుల దశకు చేరుకున్నాయి. అయితే ఇప్పటికీ మధ్య పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమనే కొట్టుమిట్టాడుతోంది. అమెరికన్లను ఉద్ధేశించి ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రసంగంలో తాము ఇరాన్‌పై సైనిక చర్యకు దిగబోవడం లేదని స్పష్టం చేశారు. బాగ్దాద్‌లోని తమ సైనిక స్థావరంపై జరిగిన ఇరాన్ క్షిపణి దాడులపై ఆయన ప్రశాంతంగానే స్పందించారు. ప్రస్తుత సంక్షోభం సద్దుమణగాలనే ఆకాంక్షను పరోక్షంగా వ్యక్తం చేశారు. ఇరాక్‌లోని తమ బలగాలకు ఎటువంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు. దాడులకు ప్రతిదాడులు ఉంటాయని చెప్పలేదు. ఇక ఇరాక్‌లోని తమ సైన్యం వల్ల ఇరాక్‌కే ప్రయోజనం ఉంటుంది తప్ప, అమెరికాకు వచ్చే లాభం ఏమీ లేదని తెలిపారు. ఇరాక్ నుంచి తమ బలగాలను వెనకకు తీసుకుంటామనే తమ మునుపటి మాటను ప్రస్తావించలేదు.

ఇరాన్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సంమయానికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రపంచ దేశాల స్పందనను పరిగణనలోకి తీసుకొంటోందని స్పష్టం అయింది. ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా అంతమొందించడం, తరువాతి క్రమంలో చెలరేగిన ఉద్రిక్తతతో ఇరు దేశాలు పరస్పరం సైనిక చర్యలకు పాల్పడుతాయని ప్రపంచ దేశాలలో ఆందోళన నెలకొంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుత దాడుల పరంపరం కేవలం ఆరంభం అని, అయితే అమెరికాపై ఇటువంటి ప్రతీకార చర్యలతో పూర్తి స్థాయి ఫలితాలను పొందలేమని ఇరాన్ అత్యున్నత నేత అయతోల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. ఈ ప్రాంతంలో అమెరికా తప్పుడు ఉనికికి ముగింపు పలకాల్సి ఉందని అన్నారు. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని చెపుతూ వచ్చిన ఇరాన్ ఇప్పటి వరకూ రెండు అమెరికా స్థారవాలపై దాడికి అందులోనూ పరిమిత దాడులతో విరామం పాటించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/