అంతర్జాలం: భావస్వేచ్ఛలో అంతర్భాగం

గ్రామాల్లోనూ అంతర్జాలం సేవలు

Internet: An integral part of freedom
Internet: An integral part of freedom

ఏ దేశానికైనా, ఆ దేశ రాజ్యాంగం ఆత్మవంటిదని అభి ప్రాయపడ్డారు మన రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌ అంబేద్కర్‌. ప్రతి రాజ్యాంగ స్వరూపం మొత్తం దాని ఉపోద్ఘాతంలో కనపడుతుంది. భారతదేశ రాజ్యాంగం కేవలం దేశపౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటమే కాక, ప్రభుత్వం ప్రజల అభ్యు న్నతి కోసం చేసే విధి విధానాలను కాపాడటంలో కూడా కీలక మైన పాత్ర పోషిస్తోంది.రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమా వేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో భావస్వేచ్ఛకు, అభిప్రాయ వ్యక్తీకరణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు.

కరోనా వ్యాధి వల్ల సమాజంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల నేడు ప్రతి ఒక్కరికి అంతర్జాలం అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక ముఖ్యమైన మానవ హక్కుగా అవతరించింది.అంతర్జాల సదు పాయం అనేది భావస్వేచ్ఛలో అంతర్భాగం. అంతర్జాలం అందు బాటులోకి రావడంవల్ల మన అభిప్రాయాలను సామాజిక మాధ్య మాల ద్వారా అందరికీ తెలియపరచడానికి అవకాశం ఉంటుంది.

కరోనా వల్ల ఈ సంవత్సరంలో విద్యావిధానం మొత్తానికి ఆన్‌లైన్‌ వేదికలు వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రస్తుత తరుణంలో మానవ మనుగడకు నీరు, నిప్పు, విద్యుత్‌ ఎంత అవసరమో అంతర్జాలం కూడా అంతే అవసరం.

అంతర్జాలం లేకుండా ఈ రోజున మన జీవన లక్ష్యాలను చేరుకోవడం అంత సులభం కాదు. 2016 ఐక్య రాజ్యసమితి సాధారణ సమావేశంలో మానవ హక్కుల సమితి, అంతర్జాల సదుపాయం అనేది నేడు అత్యంత ముఖ్యమైనమానవ హక్కుగా అభివర్ణించింది. 2012 ఆగస్టులో అంతర్జాల సమాఖ్య నిర్వహించిన ఒక సర్వేలో పదివేల మంది పాల్గొనగా, 20 దేశాల నుండి వాళ్లల్లో 83 శాతంమంది అంతర్జాల సదుపాయాన్ని ప్రాథమిక మానవ హక్కుగా చట్టబద్ధం చేయాలని అభిప్రాయపడ్డారు.

సమాజంలో ఓ గౌరవ ప్రదమైన జీవనం సాగించాలంటే ప్రాథమిక హక్కులు తప్పనిసరి. సమాజంలో వేళ్లూనుకున్న అసమానతలు, అంతరాలు, పేదరికం వంటి అనేక సమస్యలు రూపుమాపడానికి ప్రాథమిక హక్కుల వల్లే సాధ్యం.

రాజ్యాంగంలోని మూడవ భాగంలో ప్రాథమిక హక్కు పొందుపరచడం జరిగింది. వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వహక్కు, భావస్వేచ్ఛ, జీవించే హక్కు, దోపిడీ నుండి విముక్తి, మత స్వేచ్ఛ ఉద్యోగం సంపాదించే హక్కు వంటి అనేక ప్రాథమిక హక్కులు పౌరులకు మన రాజ్యాంగంకల్పిస్తోంది. కరోనా వల్ల ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. లక్షలాది ఉద్యోగాలు ఆవిరైపోవడటంతో యువత రోడ్లపైపడ్డారు.

తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని యువతలో ఆందోళన, భయం మరింత పెరిగిపోతోంది. ఈ విపత్కర పరిస్థితుల వల్ల మార్కెట్లోని వ్యాపారాలు 50 శాతం అంతర్జాల పరమైపోయాయి. వ్యాపార, వాణిజ్యవర్గాలు కార్పొరేట్‌ సంస్థలు తమ కార్యకలాపాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి ఇప్పటికే అలవాటుపడ్డాయి. ఆన్‌లైన్‌లో సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తూ తమ పనులను ముందుకు తీసుకువెళ్తున్నాయి.

అంతర్జాలంలో ఇప్పటికే ఎక్కువ శాతం ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. రోజువారి కార్యకలాపాలు నిర్వహణకు అంతరా యాలు లేని అంతర్జాలం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా సమాచార సేకరణ, దాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి, అంతర్జాలం అత్యవసరం. లాక్‌డౌన్‌ వల్ల పాఠశాలలు, కళాశాలలు మూతపడటంతో అతి తక్కువ ఖర్చులో, నాణ్యమైన విద్యను ఆరు నెలలుగా అంతర్జాలం ద్వారా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నారు.

దీనివల్ల వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని చెప్పవచ్చు. ఇప్పటికీ దేశంలో 40 శాతం వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు అంతర్జాలం అందుబాటులో లేదు.దేశంలోని ప్రతిపౌరుడికిస్వేచ్ఛగా మాట్లాడటం తమఅభిప్రాయాలు వెల్లడించడానికి హక్కులున్నాయి. ఎరవైనా సరే తమ అభిప్రాయాలను, ఆలోచనలను నోటి ద్వారా కాని, రాత ద్వారా కాని, మరే విధంగానైనా వెల్లడించే హక్కు ఉంది.

రాజ్యాంగంలోని 19(1) ఆర్టికల్‌ ప్రకారం దేశంలో ప్రతి వ్యక్తికి తన ఆలోచనలను వ్యక్తపరించే హక్కు ఉన్నది. ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తపరచవచ్చు. ఆర్టికల్‌ 21ఎ ప్రకారం దేశంలోని ప్రతిపౌరుడికి చదువ్ఞకునే హక్కు ఉంది.14ఏళ్ల వయస్సు వరకూ చదువ్ఞకునే అవకాశం మన రాజ్యాంగం కల్పిస్తోంది.

ఉచిత నిర్బంధ విద్యతోపాటు, అంతర్జాల సదుపాయం, ఉపాధి తప్పనిసరిగా యువతకు అందిస్తేనే సాధికా రత సాధించగలుగుతారు. ఆర్టికల్‌ 21 ప్రకారం రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత స్వేచ్ఛ ప్రసాదించింది.ఇందులోనే వ్యక్తిగత గోప్యత కూడా ఇమిడిఉంది.అంతర్జాలం ద్వారా విద్య, వ్యాపారం, వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమైతే, అంతర్జాలం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛ కూడా సాధ్యమే. అందుకే 2015 నవంబరులో ఐక్యరాజ్య సమితి సమావేశం అంతర్జాల సదుపాయం పొందే హక్కును కూడా ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని నిర్ణయించింది.

విద్యాహక్కు మాదిరిగానే అంతర్జాల హక్కును కూడా అంతర్జాతీయ రాజకీయ, పౌర ఒడం బడికలో ఆర్టికల్‌ 13 అత్యవసరం అని పేర్కొన్నది. సమాచారాన్ని స్వేచ్ఛగా వ్యాపింప చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు.సంప్రదాయ మీడియాకు భిన్నంగా నేడు అంతర్జాలంద్వారా సమాచారాన్ని అత్యంత వేగంగా అందుకోగలుగుతున్నాం.

2016లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమాఖ్య అంతర్జాల సదుపా యాన్ని ప్రాథమిక మానవ హక్కుగా ప్రకటించింది. అభివృద్ధిచెందుతున్న దేశాలలోని ప్రజలకు అభివృద్ధి చెందే హక్కును మూడోతరం మానవ హక్కుగా ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. అంతర్జాతీయ చట్టాలు కూడా మానవ హక్కులకు, అంతర్జాలసదుపాయం పొందే హక్కుకు, ఉన్న అవినా భావ సంబంధాన్ని గుర్తించాయి.

2020 అనిరుధ్‌భాసిన్‌ కేసులో అంతర్జాల సదుపాయం పొందే హక్కును, స్వేచ్ఛగా అందరూ సంభాషించే హక్కుగా అభిప్రాయపడింది. ఈ కేసులో అంతర్జాల సదుపాయాన్ని తృణీకరించడం, అధికారాన్ని దుర్వినియోగపరచ డమే అని పేర్కొన్నది.

ఆర్టికల్‌ 21ఎ ప్రకారం విద్యాహక్కును కలిగి ఉండటం,అదేవిధంగా 19(1) ఆర్టికల్‌ ప్రకారం వృత్తి, వ్యాపా రాలు కొనసాగించే హక్కు కలిగి ఉన్నామంటే అంతర్జాలం ద్వారా వాటిని నిర్వహించే హక్కుకూడా కలిగి ఉండటమే.కేరళ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా వేసిన ఒక కేసులో అంతర్జాల సదుపాయం పొందేహక్కు, వ్యక్తి గత గోప్యతలో అంతర్భాగమే అని ఆ రాష్ట్ర కోర్టు స్పష్టంచేసింది.

అదే కేసులో కళాశాలలు మౌలిక వసతుల కొరతతో విద్యార్థులను వివక్షకు గురిచేయడం నేరమని పేర్కొన్నది. అంతర్జాల సదుపాయం పొందేహక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛవంటి వాటిలో అంతర్లీనంగా దాగి ఉంటుందనేది తోసిపుచ్చ లేనివాస్తవం. అంతర్జాలం అందుబాటులో ఉండటం వల్ల పౌరులు తమ అభిప్రా యాలను అంతర్జాతీయ వేదికలపై పంచుకోవడానికి అవకాశం ఉంటుంది.

మన రాజ్యాంగంలోని స్వర్ణత్రికోణంలో 21, 19,14 అధికరణ, వ్యక్తిగత స్వేచ్ఛ, భావప్రకటన, సమానత్వపు హక్కు లను ప్రసాదిస్తున్నాయి. కాని అంతర్జాలం అందుబాటులో లేక సమాజంలోని ఒకవర్గం మాత్రమే అంతర్జాలఫలాలను అను భవిస్తుంటే రాజ్యాంగంలోని అధికరణలను ధిక్కరించినట్లే. డిజిటల్‌ అసమానతలను ప్రోత్సహించినట్లే.

మొదటి నుండి రాష్ట్రప్రభుత్వం కుల, మత, వర్ణ, అసమానతలను రూపుమాపే దిశగా పాలన కొనసాగిస్తోంది. ఇప్పుడు డిజిటల్‌ అంతరాయం లేకుండా ఉండటా నికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు అంతర్జాల సౌకర్యం కల్పించ డానికి నడుం బిగించింది.

ప్రతి గ్రామానికి భూగర్భ కేబుళ్ల ద్వారా అంతర్జాల కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. గ్రామ సచివా లయాల్లో డిజిటల్‌లైబ్రరీని ఒకదాన్ని స్థాపించి గ్రామీణ యువతకు అంతర్జాల సేవలు అందుబాటులోకి తేనున్నారు.

  • అలేఖ్య

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/