రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్యనాయుడు

వార్తల్లోని వ్యక్తి (ప్రతి సోమవారం)

Venkaiah Naidu

సా ధారణంగా పార్లమెంటులో రెండు సభలుంటాయి- ఎగువసభ, దిగువ సభ. దిగువ సభను సరాసరి ప్రజలే- ఓటర్లే- ఎన్నుకుంటారు. దిగువ సభ సభ్యులు ఎగువ సభ సభ్యులను ఎన్నుకుంటారు. చాలా దేశాలలో ఎగువ సభలకే హెచ్చు అధికారాలుంటాయి.
మొన్న అమెరికాలోనే చూడండి. ప్రెసిడెంట్‌ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం వచ్చింది. దిగువ సభలో అది దిగ్విజయంగా ఆమోదించబడింది. ఎగువసభలో ట్రంప్‌ నెగ్గారు. అందువల్ల ఆయన పదవిలో వ్ఞండగలిగారు, ఇండియాలో రెండు రోజుల పాటు దిగ్విజయంగా పర్యటన చేయగలిగారు.
ఈరెండు సభల ‘కన్సెప్ట్‌ మొదట ఇంగ్లాండ్‌లో ఏర్పడింది- కామన్స్‌సభ, ప్రభువ్ఞల సభ (లార్డ్స్‌సభ). ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాలోను, ఫ్రాన్స్‌లోను ఎగువ సభను సెనేట్‌ అంటారు.
కాగా, నవభారత రాజ్యాంగ రచన చేసేటప్పుడు ఈ రెండు సభల ‘కాన్సెప్ట్‌ను తీసుకున్నారు. దిగువసభకు లోక్‌సభ అని, ఎగువ సభకు రాజ్యసభ అని నామకరణం చేశారు. కొన్ని విషయాలలో ఎగువసభకు అధిక అధికారాలుంటాయి.

అమెరికా సెనేట్‌ సంప్రదాయం

కాగా, నవ భారత రాజ్యాంగ రచయితలు అమెరికా ఎగువ సభ నుంచి ఒక సంప్రదాయాన్ని తీసుకున్నారు. దేశ ఉపాధ్యక్షుడే ఎగువ సభకు అధ్యక్షుడు. ఈ సంప్రదాయాన్ని భారతదేశం అమెరికా నుంచి తీసుకున్నట్టు కనబడుతుంది. నిజానికి, భారత రాజ్యాంగం వివిధ దేశాల రాజ్యాంగాల సమామ్నాయం!
కాగా, భారతదేశ ఉపరాష్ట్రపతులలో ఇద్దరు- సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వి.వి.గిరి- ఎగువ సభలకు రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవిని నిర్వహించారు- సమర్థంగా.

ఒక బాధాకరమైన సన్నివేశం

వారిద్దరు రాజ్యసభను హుందాతనంతో నిర్వహించారు. వారిద్దరిలో డాక్టర్‌ రాధాకృష్ణన్‌ మరీను. వీరిద్దరు తరువాత రాష్ట్రపతులుగా కూడా ఎన్నికైనారు.
అయితే, తెలుగువాడు కాదు కాని, డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌శర్మ రాజ్యసభ అధ్యక్షుడుగా వ్ఞన్నప్పుడు ఒక బాధాకరమైన సన్నివేశం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు కొందరి విమర్శలకు, విపరీతప్రవర్తనకు తట్టుకోలేక ఆయన సభలోనే కన్నీరు కార్చారు! ఆయన మహాపండితుడు. ఆయనకున్నన్ని డిగ్రీలు ఎందరికో వ్ఞండవ్ఞ. ఆయన ఆ తరువాత రాష్ట్రపతి అయినారు కూడా.

వెంకయ్యనాయుడు హయాం

ఆ తరువాత వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవి అలంకరించారు. 2017 ఆగస్టులో ఆయన ఆ పదవిని అలంకరించినప్పటి నుంచి రాజ్యసభ అధ్యక్ష పదవిని కూడా హుందాగా, సమర్థంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఆయన కూడా వ్ఞన్న ఒక సభలో తెలుగువారు దేశ ఉపరాష్ట్రపతి అయి, చాలా కాలమైందని, ఈసారి తెలుగువారికే ఆ అవకాశమివ్వాలని నేను సభలో తీర్మానం ప్రతిపాదించగా, ఆ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రధాని మోడీకి పంపాను.

సర్వసమర్థులైన ముప్పవరపు వెంకయ్యనాయుడు చాలాకాలం తరువాత తెలుగువారికి ఉపరాష్ట్రపతి అయిన గౌరవం దక్కించారు. అంతేకాదు-రాజ్యసభ అధ్యక్షుడుగా ఆ సభను ఎంతో హుందాతనంతో, సమర్థంగా, సహజసిద్ధమైన గంభీరంగా నిర్వహిస్తున్నారు. అన్ని పక్షాలకు వాటి వాటి సంఖ్యకు అనుగుణంగా సభలో అవకాశమిస్తున్నారు.

ఉదాహరణకు, మొత్తం రాజ్యసభ ప్రస్తుత సభ్యుల సంఖ్య 239 కాగా, వారిలో బిజెపికి 82 మంది సభ్యులున్నారు. అంటే, ఆ పార్టీ సభ్యుల సంఖ్య మొత్తం సభ్యులలో 34శాతం. వారికి సభలో వచ్చిన ‘ప్రస్తావన అవకాశాలు 33శాతం! అలాగే కాంగ్రెసుకు సభలో 46 మంది సభ్యులున్నారు.

అంటే మొత్తం సభలో 19శాతం. అయినా, ప్రతిపక్షమైన కాంగ్రెసుకు 24శాతం ప్రస్తావనలు చేసే అవకాశం లభించింది.! సాధారణంగా సభాపతులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, సభలో సమస్యలను ప్రస్తావించే అవకాశాలివ్వడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఫిర్యాదులు చేయడం కద్దు. ఇవి ఫిబ్రవరి నెల 11వ తేదీన ముగిసిన రాజ్యసభ సమావేశాల రికార్డు. అలాగే చిన్న చిన్న పార్టీలకు కూడా వాటి సంఖ్యకుమించిన నిష్పత్తిలో అవకాశాలివ్వడం నాయుడుగారి ప్రత్యేకత. 2022 ఆగస్టుకు ఆయన ఉపరాష్ట్రపదవీకాల పరిమితి ముగుస్తుంది. అప్పుడు ఈ తెలుగు దిగ్దంతి రాష్ట్రపతి పీఠాన్ని అలంకరించాలని ఆశిద్దాం.
కాగా, ఆయన రాజ్యసభ అధ్యక్ష పీఠాన్ని అలంకరించిన కొత్తలోనే ఇద్దరు సభ్యులను సభాబహిష్కరణ చేయడం కొసమెరుపు!

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు,(‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/