సోషల్ మీడియా ఫేక్ వార్తలపై కొరడా..

, social media rules

సోషల్ మీడియా లో ఫేక్ వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు చట్టం సిద్ధమైంది. సోషల్ మీడియా పేజీ చేతిలో ఉంది కదా..ఏదైనా రాస్తాం..ఏదైనా పోస్ట్ చేస్తామంటే ఇక కుదరదు. మరో రెండు వారాల్లో కొత్త మార్గదర్శకాలు రాబోతున్నాయి. ఏదైనా బ్రాండ్‌కు ప్రచారం చేసే, ప్రభావితం చేసే వ్యక్తులు (ఇన్‌ఫ్లుయెన్సర్లు) స్పష్టమైన, వాస్తవ సమాచారాన్ని మాత్రమే అందించాల్సి ఉంది. అలాగే ఈ-కామర్స్ సైట్లలో ఆయా వస్తువులపై రివ్యూలు రాసేవారు కూడా ఇకపై వాస్తవ దృక్పథంతోనే రాయాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు. పదేపదే ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.50 లక్షల భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే జరిమానా కట్టాల్సిందే. తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే ప్రకటనల నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో పది రోజుల్లో ఒక ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాన్ని (ఎస్‌వోపీ) విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే కంపెనీల నుంచి ఇతర వ్యక్తుల నుంచి ఉచితంగా వస్తువులు తీసుకొని వాటికి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారు.. అలా పొందిన వస్తువులకు ముందస్తుగా 10 శాతం టీడీఎస్ ను సైతం చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ సదరు సెలబ్రిటీ తాము పొందిన వస్తువును తిరిగి కంపెనీకి తిరిగి ఇచ్చేసిన పక్షంలో తాము చెల్లించిన 10 శాతం టీడీఎస్ ను తిరిగి పొందేందుకువీలు ఉంటుంది. మొత్తంగా చూసినప్పుడు ఇప్పటి మాదిరి సోషల్ మీడియాలో తమకు తోచినట్లుగా రివ్యూలు ఇచ్చే బ్లాగర్లు.. ఏదో ఒక ఉత్పత్తికి ప్రచారం చేసే వారికి కొత్త మార్గదర్శకాలతో షాకులే షాకులన్న మాట వినిపిస్తోంది.