అగ్నిపథ్‌ అలజడి : ఏపీలో మధ్యాహ్నం వరకు రైల్వే స్టేషన్లు మూసివేత ..

కేంద్రం తీసుకొచ్చిన అగ్ని పథ్ స్కీంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ స్కీంను కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ బీహార్, హర్యానాలో మొదలైన ఈ ఆందోళనలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు తాకాయి. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రం వైఖరిని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు చేపట్టిన ఆందోళన నిమిషాల వ్యవధిలోనే హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు రైళ్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు బోగీలకు నిప్పు పెట్టారు. అంతటితో శాంతించని ఆందోళనకారులు ఫ్లాట్ ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు నిప్పంటించారు. రైల్వే స్టేషన్ బయట బస్సులపై రాళ్లు రువ్వారు. ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరుపగా..ఓ యువకుడు మృతి చెందాడు.

ఇక ఈరోజు శనివారం ఏపీలో ఆర్మీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపేందుకు రోడ్ల పైకి రావడం తో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ఏపీలో అన్ని రైల్వే స్టేషన్‌లను మూసివేశారు. భద్రతా కారణాల దృష్టా రైల్వే స్టేషన్‌లను మూసివేస్తున్నట్టు తెలిపారు అధికారులు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్టేషన్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్ , తిరుపతి , విజయవాడ , నెల్లూరు , అనకాపల్లి మొదలగు స్టేషన్ల వద్ద భారీగా పోలీసులు చేరుకొని ఆ వైపు వచ్చేవారిపై నిఘా పెట్టారు. ఇప్పటికే బయలుదేరి విజయవాడ మీదుగా విశాఖపట్టణం చేరుకోవాల్సిన రైళ్లను దువ్వాడ వద్ద, హౌరా నుంచి వచ్చే రైళ్లను కొత్తవలస వద్ద నిలిపివేసి దారి మళ్లిస్తామని అధికారులు తెలిపారు. రైళ్లు విశాఖ రాకుండా ఏర్పాటు చేసి స్టేషన్‌లోకి ఎవరూ చొరబడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.