ఆటోమొబైల్ రంగం కారణంగా కాలుష్యం పెరిగిపోతుంది
ఒక్కరి ప్రయాణానికి.. భారతీయులు పెద్ద కార్లు వాడతారు

ముంబయి: ప్రయాణించేది కేవలం ఒక వ్యక్తే అయినా.. అందుకోసం భారతీయులు చాలా పెద్ద కార్లు వాడతారంటూ మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా విమర్శించారు. ఆటోమొబైల్ రంగం కారణంగా కాలుష్యం మరింతగా పెరుగుతోందని, తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని పిలుపునిచ్చారు. ఐఐటీ కాన్పూర్‌లో శనివారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గోయెంకా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏమన్నారంటే.. 65 నుంచి 70 కిలోల బరువుండే వ్యక్తి.. 1500 కిలోల బరువైన కారు లో ఒక్కడే ప్రయాణిస్తున్నాడు. ఇది వనరుల దుర్వినియోగమే. ఒక్కరుగా ప్రయాణించేందుకు అనుకూలమైన రవాణా విధానాన్ని భారత్‌లో రూపొందించాల్సిన అవసరం ఉంది. టాటా నానో మంచి ఆలోచనే అయినప్పటికీ.. దానికి పెద్దగా ఆదరణ దక్కకపోవడం బాధాకరం. ఈ లోటు ను పూడ్చేందుకు మహీంద్రా నుంచి త్వరలో ఒక చిన్న కారును తీసుకురానున్నాం. వాతావరణంలోని కర్బన వాయువులో 7 శాతం వాటా వాహనాల కాలుష్యానిదే. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అందరూ నడుంబిగించాలి. ఎక్కువ మంది ఒకే కారులో ప్రయాణించే కనెక్టెడ్ కార్ వంటి ఏర్పాట్లు రావాలి. విద్యుత్ వాహనాల (ఈవీ) విషయంలో భారత్ చాలా వెనుకబడి ఉంది. గత ఏడాది కేవలం 1400 విద్యుత్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రపంచ ఈవీ మార్కెట్‌తో పోలిస్తే.. భారత్ ఎంతో మెరుగుపడాల్సి ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/