నానాటికి తీసికట్టు చందంగా మన ప్రజాస్వామ్యం

Indian Democracy

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా పేరొం దిన భారతదేశంలో ప్రజాస్వామ్యం నేతిబీరకాయలో నెయ్యి చందాన తయారయ్యిందని ఇటీవల దేశంలో జరుగుతున్న అప్రజాస్వామ్య పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. తాజాగా డెమోక్రసీ ఇండెక్స్‌ నివేదికలో మనదేశం ప్రజాస్వామ్య సూచికలో 51వస్థానంలో ఉందని పేర్కొన్నది. 2006 నుండి ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ వారు ప్రతిఏటా 165 దేశాలకు సంబంధిం చి నివేదికను విడుదల చేస్తున్నారు. 2017లో 42వ ర్యాంకురాగా 2018లో 41ర్యాంకు రాగా తాజాగా 2019లో పదిస్థానాలు దిగ జారి 51వ ర్యాంకుకు పడిపోయింది. ప్రజాస్వామ్యదేశంలో 987 మార్కులతో నార్వే 167దేశాలలో మొదటిస్థానంలో ఉండగా మన దేశం 680 మార్కులతో 51వస్థానంలో ఉంది.ఎన్నికల నిర్వహణ, పౌరహక్కులు, ప్రభుత్వ పాలన, రాజకీయ ప్రాతినిధ్యం, సంస్కృ తి విభాగాల్లో ఆయా దేశాల పనితీరును మదింపు చేసి ర్యాంకులు ఇవ్వడం జరుగుతోంది.మార్కులఆధారంగా ప్రపంచదేశాలను ప్రజా స్వామ్యదేశాలు (8) అప్రజాస్వామిక దేశాలు (6) నామమాత్రపు ప్రజాస్వామ్యదేశాలు (4) నియంత్రృత్వపాలన (4కన్నా తక్కువ) నాలుగు గ్రూపుల కింద విభజించారు. మనదేశం అప్రజాస్వామిక దేశం కింద నమోదయింది. ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థికవ్యవస్థ అయినా చైనా 2.26 మార్కులతో 153వ ర్యాంకుతో నియంతృ త్వపాలన దేశంగా పేర్కొనబడింది. చైనా ఇంతగా దిగజారిపోవడా నికి కారణం గత ఏడాది కాలంగా ఆ దేశంలో మైనార్టీల పట్ల చూపిస్తున్న వివక్ష. డిజిటల్‌ నిఘా పేరుతో దేశంలోని పౌరుల స్వేచ్ఛనుహరించటమే. రష్యా, చైనా కన్నా కొంత మెరుగ్గా 3.11 మార్కులతో 134వస్థానంలో ఉంది. నార్వే తర్వాత, ఐస్‌ల్యాండ్‌, స్వీడన్‌, న్యూజిలాండ్‌, ఫిన్‌లాండ్‌ మొదటి ఐదుస్థానాల్లోఉన్నాయి. కెనడా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌ మొదటి పదిస్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.అందరూ ఊహించినట్లే ఉత్తరకొరియా అట్టడుగు స్థానంలో 167వస్థానంలో నిలిచింది. నివేదిక రూపొందించిన వారి అభిప్రాయం ప్రకారం నేడు ప్రపంచంలో మూడోవంతు దేశాలు నియంతల పాలనలో నడుస్తున్నాయి. పేరుకు ప్రజాస్వామ్యదేశాలే కాని, రాష్ట్రపతులు, సైనిక అధికారులు దేశాల పగ్గాలు చేతబట్టి ప్రజాస్వామ్యాన్ని చరబట్టి ప్రజల హక్కులను కాలరాస్తూపరిపాలన కొనసాగిస్తున్నారు. మన పొరుగున ఉన్న పాకిస్థాన్‌ అందుకు ఉదా హరణగా(108 స్థానంలో 4.25మార్కులతో) ఉంది.

మనదేశం ఒక ఏడాదిలో పది ర్యాంకులు పడిపోవడానికి కారణం ముఖ్యంగా కాశ్మీరులు 370 ఆర్టికల్‌ రద్దు చేసి అక్కడి ప్రజల స్వేచ్ఛ స్వాతం త్య్రాలను హరించడమే. కాశ్మీర్‌లో పెద్దఎత్తున కేంద్ర బలగాలను మోహరించడం, ఇంటర్నెట్‌ వంటి ప్రాథమిక సేవల్ని స్తంభింప చేసి,పౌరహక్కుల్ని కాలరాయడంపట్ల నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్‌ఆర్‌సి, సిఎఎ పేరిట దేశంలోని మైనార్టీ ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించటం కూడా మరో కారణం. అసోం ఎన్నార్సీ ప్రక్రియ వల్ల లక్షలాది మంది భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. ఒకప్పుడు ఒక్క పార్లమెంటు సభ్యుడ్ని కొనుగోలు చేస్తే ఐదు ఏళ్లు ప్రధానిగా కొనసాగవచ్చని తెలిసినా ప్రజాస్వామ్య విలు వలకు కట్టుబడి, ప్రధాన మంత్రి పదవినే వదులుకున్న పార్టీ నేడు కేవలం రాజ్యసభలో తమ మాటనెగ్గించుకోవడానికి అవినీతి ఆరోపణలున్న ఇతర పార్టీ సభ్యులను తమ పార్టీలోకి చేర్చుకునే స్థాయికి దిగజారిందంటే ప్రజాస్వామ్యం ఏస్థాయిలో ఖూనీ చేయ బడుతుందో అర్థంకానిది కాదు.పూర్వం మహారాజులు అశ్వమేధ యాగం పేరుతో తమకన్నా బలహీనులైన రాజులను జయించు కుంటూపోతూ తమ రాజ్యాన్ని విస్తరించుకుంటూ తమలోని అధికార కాంక్షని చల్లార్చుకునేవారు.

నేడు పాలకులు కూడా మతవాదం, జాతీయ వాదంవంటి వాటితో ప్రజల్ని వర్గాలుగా చీల్చి తమ అధికారాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కేవలం కేంద్రప్రభుత్వమే కాదు గత కొంత కాలంగా అనేకరాష్ట్రాల్లో అప్రజాస్వామిక చర్యలతో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నేల కూలాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల కర్ణాటకలో జరిగిన పరిణామాలు, మహా రాష్ట్రలో జరిగిన మహానాటకం. ఒకప్పుడు రాజకీయాల్లోకి విలు వలు కలిగిన వ్యక్తులు వచ్చేవారు. కాని నేడు ఏ పార్టీలో చూసినా విలువలు లేని నాయకులే కనపడుతున్నారు. పొద్దున ఒకపార్టీలో, మధ్యాహ్నం మరో పార్టీలో, రాత్రి ఇంకో పార్టీలో చేరుతూ రాజ కీయాన్ని పూర్తిగా మార్చేవేశారు. రాజకీయ నాయకులు మాత్రం డబ్బు సంపాదన కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా రు. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం 23 మంది విపక్ష సభ్యుల్ని కొనుగోలు చేసి వారిలో నలుగురికి అధికారాన్ని కట్టబెట్టినా ప్రజా స్వామ్యాన్ని కాపాడాల్సిన స్పీకరు చూసిచూడనట్టు ఉండటం అప్ర జాస్వామ్యానికి పరాకాష్ఠ.కేవలం ఆంధ్రరాష్ట్రంలోనే కాదు తెలం గాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇదే తంతు నడిచి చివరకు ఏ పార్టీవారు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.శాసనసభాపతి గౌరవాన్ని ఈ పరిణామాలు ఎంతగానో దిగజార్చాయి.ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో కూడా మూడు రాజధానుల విషయంలో బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపే ప్రక్రియ లో మండలి ఛైర్మన్‌ కూడా అప్రజాస్వామికంగా వ్యవహరించి మండలి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చివేశారు.

తాను తప్పు చేస్తున్నానని ప్రకటించి మరీ తప్పు చేయడం అప్రజాస్వామికం కాక మరొకటి కాదు.అధికారంలోకి రాగానే ఐదేళ్లపాటు తమనెవరు ఏమీ చేయలేరు అనే ఒక అహంకారంతో అప్రజాస్వామిక చర్య లకు ప్రభుత్వాలు పూనుకోవడం పరిపాటిగా మారిపోయింది. కేంద్రం కూడా రాష్ట్రాలఅధికారాలను కాలరాస్తూ,రాష్ట్రాలకు అందా ల్సిన నిధులను తొక్కిపడుతూ వాటిని తమ ముందు జోలెపట్టుకు నేటట్లు చేస్తుంది. రాష్ట్రాలు కూడా తామేమి తక్కువ తినలేదన్నట్లు అధికారాలను తమ గుప్పెట్లో పెట్టుకుని స్థానిక సంస్థలనునిర్వీర్యం చేస్తూవస్తున్నాయి. అధికార వికేంద్రీకరణకు మొగ్గుచూపకపోవడం వలన గ్రామీణభారతం పూర్తిగా వెనుకబడిపోయింది.జిల్లా పరిషత్‌ మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఎన్నికలుజరిగి ఎన్నోఏళ్లు అయిం ది. మనదేశంలో జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి అనే కన్నా ధనస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి అనవచ్చు.ఎన్నికల సమయంలో డబ్బు మందు ఏరులైపారుతున్నా ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు.నిన్నటికినిన్న తెలంగా ణా రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ఎన్నికల్లో సైతం ఓటుకునాలుగు, అయిదు వేలు పంచారంటే ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఎన్ని కలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. గెలిచిన తర్వాత అధికారాన్ని కైవసం చేసుకోవడానికి విపక్ష సభ్యులను పశువ్ఞలను కొన్నట్లు కొంటున్నారు.

ఓటుకు నోటుకేసులో ఏం జరిగిందోఅందరికీవిదితమే. పాలనాపరమైన లోపాలను ఎత్తిచూపే మేధావ్ఞలపై దేశంలో వేధిం పులు పెరిగిపోయాయి.భావస్వేచ్ఛకు పుట్టినిల్లు అయిన విశ్వవిద్యా లయాల్లో విద్యార్థులపై దాడులు పెరిగి అవి నేడు అగ్నిగుండంలా మారుతున్నాయి.దేశంలోని ప్రజలు మూలాలనుప్రశ్నిస్తుంటే యువ త మనోభావాలు దెబ్బతిని దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలతో అట్టుడికిపోతోంది.30 మందికి పైగా అమాయకులు పోలీసుల కాల్పుల్లో బలైపోయారు. జాతీయ భద్రతా చట్టంకింద వామపక్ష, మైనార్టీ,మహిళ,దళిత,నాయకులను అక్రమంగా నిర్బం ధిస్తున్నారు.రచయితలు, కళాకారులపై మతవాద మూకల దాడులు ఎక్కువయ్యాయి.ప్రపంచదేశాలలో ప్రజాస్వామ్య ప్రస్థానం అనేక ఒడిదుడుకులతో సాగుతోంది.మనదేశంలో ఆ ఒడిదుడుకులు మరిం త ఎక్కువగా ఉన్నాయి.ఈ ఒడిదుడుకులను అధిగమించి ప్రజాస్వా మ్యవ్యవస్థను మరింత పటిష్టంచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాని ప్రభుత్వాలు తమ అధికార పీఠాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజ్యాంగం ప్రజలకు ప్రసా దించిన హక్కులనుహరిస్తూ పరోక్షంగా నియంతులుగా వ్యవహరిం చడంవల్లే మనదేశం అప్రజాస్వామిక దేశాల సరసన నిలబడాల్సిన అగత్యం ఏర్పడింది. ఇప్పటికైనా పాలకులు మేల్కొనాలి. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. కాలానుగుణంగా చట్టాలలో రాజ్యాంగంలో మార్పులు తీసుకురా వాలి.ఆ మార్పులు దేశంలోని ప్రజలు మరింత స్వేచ్ఛగా, స్వతం త్రంగా జీవనం కొనసాగేటట్లుండాలి.యువతలో రాజకీయ చైతన్యా న్ని పెంపొందించినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢిల్లుతుంది.

-ఈదర శ్రీనివాసరెడ్డి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/