హమాస్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడిన ప్రధాని మోడీ

ఇజ్రాయెల్‌ కు భారత్‌ మద్దతు..

‘India stands with Israel’: PM Modi speaks to Israeli PM on Hamas attacks

న్యూఢిల్లీః పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్‌ కు భారత్‌ మద్దతు తెలిపింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఈ మేరకు పీఎం మోడీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినందుకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారు. అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని భారత్‌ తీవ్రంగా ఖండిస్తోంది’ అని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, హమాస్ దాడులతో ఇజ్రాయెల్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాలూ దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ రెండు వైపులా 1,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు వేల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.

గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు. ఇక హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్‌లో కనీసం 900 మంది మరణించారు. 2,600 మంది గాయపడ్డారు. బందీలుగా ఉన్న 100 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఓ వ్యవసాయ పొలంలో లభించాయి.