ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోంది: ప్రధాని మోడీ ట్వీట్

‘India stands with Iran’: PM Modi condoles President Ebrahim Raisi’s death

న్యూఢిల్లీః ఇరాన్ అధ్యక్షుడు సయ్యిద్ ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇరాన్-అజర్ బైజాన్ సరిహద్దుల్లో ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీతో పాటు విదేశాంగమంత్రి, అజర్ బైజాన్ గవర్నర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అడవుల్లో కుప్పకూలింది. దీంతో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేకపోయారు. ఈ దుర్వార్తను ఇరాన్ ప్రభుత్వం ఈరోజు ధృవీకరించింది.

ఈ నేపధ్యంలో పలువురు ప్రపంచ దేశాధినేతలు స్పందిస్తున్నారు. నిన్న ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఆచూకీ లేకుండా పోవడంతోనే ఆందోళన మొదలైంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని పలువురు ప్రపంచ దేశాధినేతలు ఆకాంక్షించారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. ఇవాళ ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా రైసీ మృతిని ధృవీకరించింది. దీంతో పలు దేశాల నేతలు, అధినేతలు తమ సంతాపం ప్రకటిస్తున్నారు.

ఇదే క్రమంలో ఇరాన్ కు మిత్రదేశమైన భారత్ కూడా స్పందించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ రైసీ మృతిపై దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు. “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ యొక్క విషాద మరణం పట్ల తీవ్ర విచారం మరియు దిగ్భ్రాంతి. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతని కుటుంబానికి మరియు ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోంది.” అంటూ మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు.