లక్షద్వీప్‌లో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించలన యోచనలో కేంద్రం

India plans new airport for Lakshadweep

న్యూఢిల్లీః బాయ్‌కాట్‌ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ఇంకా ట్రెండవుతున్నది. ఆ దేశ మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. లక్షద్వీప్‌ మినీకాయ్ ద్వీపంలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో లక్షద్వీప్‌లో పర్యాటకరంగం మరింత పెరుగుతుందని భావిస్తున్నది. కొత్తగా విమానాశ్రయం నిర్మిస్తే మిలటరీకి సైతం ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది. పౌర విమానాలతో పాటు మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫైటర్‌ జెట్స్‌కు కొత్త ఎయిర్‌పోర్ట్‌ జాయింట్ ఎయిర్‌ఫీల్డ్‌గా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సైనికపరంగా కొత్త విమానాశ్రయం నిర్మాణంతో అరేబియా సముద్రం, హిందు మహాసముద్రం పర్యవేక్షణలో భారత్‌కు వ్యూహాత్మకంగా సహాయపడుతుంది. మినీకాయ్ ద్వీపంలో ఎయిర్‌స్ట్రిప్ నిర్మించాలని ఇండియన్ కోస్ట్ గార్డ్ గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తాజాగా ప్రతిపాదనలో భారత వైమానిక దళం కార్యకలాపాలకు అవకాశం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం లక్షద్వీప్‌పైనే ఉన్నది. మినీకాయ్‌లో విమానాశ్రయం నిర్మాణం చేపడితే లక్షద్వీప్‌లో పర్యాటకం సైతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం లక్షద్వీప్‌లోని అగట్టి ద్వీపంలో ఎయిర్‌స్ట్రిప్ ఉంది.

కానీ అన్ని రకాల విమానాలు ఇక్కడ దిగలేవు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి లక్షద్వీప్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో మోడీ షేర్‌ చేసిన చిత్రాలను చూసిన నెటిజన్స్‌ లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. ఈ క్రమంలో మాల్దీవుల మంత్రులు భారత్‌తో పాటు ప్రధానిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం తర్వాత ప్రధాని మోడీపై వ్యాఖ్యలు చేసిన మంత్రులను మాల్దీవులు ప్రభుత్వం వేటు వేసింది.