తెలుగు విద్యార్థి మృతిపై అమెరికా పోలీసు అపహాస్యం.. దర్యాప్తునకు భారత్ డిమాండ్

ఘటనపై జోకులు వేసిన స్థానిక పోలీసులు

India demands probe after video shows US cop mocking Indian student’s death

న్యూఢిల్లీః అమెరికాలో ఆంధ్రా యువతి మరణాన్ని పోలీసులు అవహేళన చేసిన ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని భారత్ తాజాగా అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. యువతి మరణాన్ని చులకన చేస్తూ పోలీసులు చేసిన వ్యాఖ్యల తాలూకు ఆడియో రికార్డింగ్ వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సియాటెల్ క్యాంపస్‌లో మాస్టర్స్ చేస్తున్న కందుల జాహ్నవి(23) ఈ ఏడాది జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. రోడ్డు దాటుతున్న ఆమెను పోలీసు కారు వేగంగా ఢీకొనడంతో ఆమె దుర్మరణం చెందారు. ఘటన సమయంలో కారును కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి నడుపుతున్నారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కేసులో ఘటనాస్థలానికి వేగంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న కారు జాహ్నవిని ఢీకొట్టినట్టు తేలింది.

కాగా, ఈ ఘటనపై పోలీసు యూనియన్.. బాధిత కుటుంబానికి 11 వేల డాలర్ల పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై మరో ఇద్దరు పోలీసుల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఓ అధికారి జాహ్నవి మరణాన్ని అవహేళన చేశారు. ‘‘ఆమెకు 26 ఏళ్లే.. ఓ సాధారణ వ్యక్తి. ఆమె ప్రాణానికి అంత విలువేమీ లేదు. పరిహారం ఇవ్వండి’’ అంటూ సియాటెల్ పోలీసుల సంఘం వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆడెరర్ చేసిన చులకన వ్యాఖ్యలు అతడి యూనిఫాంకు అమర్చిన మైక్‌లో రికార్డయ్యాయి. డిపార్ట్‌మెంట్‌లో జరిగిన సాధారణ తనిఖీల్లో ఈ ఆడియో బయటపడటంతో వివాదానికి దారి తీసింది.

ఈ ఘటనపై శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని భారత కాన్సులేట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి మరణంపై ఇటువంటి చులకన వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరమని , ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని సియాటెల్, వాషింగ్టన్‌లో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఘటనపై లోతైన దర్యాప్తు జరగాలని విజ్ఞప్తి చేశామని కాన్సులేట్ కార్యాలయం ‘ఎక్స్’ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కాగా, ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు.