రేపు ఐరాస సమావేశంలో కెనడా ప్రధాని ఆరోపణలపై జైశంకర్ సమాధానం?

భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల సమయంలో ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ

India-Canada Diplomatic Row.. EAM Jaishankar’s Reply Awaited On Trudeau’s Allegations At UNGA Tomorrow

న్యూఢిల్లీ : భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ రేపు న్యూయార్క్‌లో జరగనున్న జనరల్ అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఏం మాట్లాడుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ ఏడాది జూన్‍‌‌లో పాక్‌లో శిక్షణ పొందిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. ఇందులో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశం జరుగుతోంది. నిజ్జర్ హత్యలో తమ లింకులపై ఆధారాలు చూపించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. జస్టిన్ ట్రూడో కెనడియన్ పార్లమెంట్ వేదికగా భారత్ పైన బురద జల్లారు. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న జనరల్ అసెంబ్లీలో జైశంకర్ నుంచి సరైన ప్రతిఘటన ఉంటుందని భావిస్తున్నారు.

రేపు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి హాజరైన అనంతరం, బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌తో ద్వైపాక్షిక చర్చల కోసం జైశంకర్ వాషింగ్టన్ డీసీకి వెళ్లనున్నారు. అక్కడి సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు నిజ్జర్ హత్య విషయమై కూడా చర్చించే అవకాశముందని తెలుస్తోంది.