కరెంట్​ షాక్​తో శ్రీచైతన్య స్కూల్​లో విద్యార్థి మృతి

శ్రీచైతన్య స్కూల్ & కాలేజీ లలో చదువుతున్న స్టూడెంట్స్ వరుస పెట్టి చనిపోవడం శ్రీచైతన్య పేరు వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి. రీసెంట్ గా నార్సింగ్ లోని శ్రీ చైతన్య కాలేజ్ లో చదువుతున్న సాత్విక్ అనే ఇంటర్ విద్యార్థి యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకోగా..ఆ తర్వాత ఐఎస్ సదన్ పరిధిలోని SBI కాలనీలో ఉండే మరో విద్యార్థి తల్లి మందలించిందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు వార్తల్లో నిలువుగా..తాజాగా మరో విద్యార్థి కరెంట్ షాక్ తో చనిపోయిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశం పాలెం గ్రామానికి చెందిన మద్దిపాటి కాశీవిశ్వనాథ్‌ కుమారుడు జశ్వంత్‌ శ్రీసాయి (17) విజయవాడ కానూరు శ్రీచైతన్య ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. తన బట్టలను ఉతుక్కుని తీగపై వేయగా పక్కనే ఐరన్‌ తీగ ఉండటంతో విద్యార్థికి విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే పడిపోయాడు. కళాశాల యాజమాన్యం నెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన పట్ల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని వారంతా ఆందోళన చేస్తున్నారు.