ఇండియా కూటమిలో అనిశ్చితి వేళ స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కాషాయ పార్టీని తిరిగి అధికారంలోకి రానివ్వకూడదనే ఉమ్మడి లక్ష్యంతో పని చేయాలని కూటమి నేతలకు సూచన

Stalin

చెన్నైః విపక్షాల ఇండియా కూటమికి ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు దూరమవ్వగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ సారధ్యంలోని జేడీయూ కూడా గుడ్‌బై చెప్పనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మిత్రపక్షాల మధ్య విభేదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇండియా కూటమికే చెందిన డీఎంకే పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బిజెపి వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఐక్యంగా ఉండాలని కూటమి నాయకులను స్టాలిన్ కోరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని అన్నారు. ‘‘ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క లక్ష్యం ఉండాలి. బిజెపిని తిరిగి అధికారంలోకి రానివ్వకూడదు. బిజెపి వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఫెడరలిజం ఉండవు’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం తిరుచిరాపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కాగా, ఇండియా కూటమిలో అయోమయ పరిస్థితి నెలకొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడంతో కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. సీట్ల పంపకాలపై కాంగ్రెస్, టీఎంసీల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మమత బెనర్జీ ప్రకటన చేసిన రోజునే పంజాబ్, హర్యానాలోని అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాకిచ్చినట్టయ్యింది. మరోవైపు నితీష్ కుమార్ విషయంలో అనిశ్చితి నెలకొంది. త్వరలో ఎన్‌డీఏ గూటికి చేరబోతున్నారని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.