కరోనాతో పెరుగుతున్న నిరుద్యోగం

అసంఘటిత రంగంపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం

Un Employment
Un Employment

ముఖ్యాంశాలు

లాక్‌డౌన్‌ తర్వాత నిరుద్యోగ శాతం 23.56
ఈనెలాఖరుకు 26శాతానికి చేరుకుంటుందని అంచనా
అర్హులకు ఉద్యోగం కల్పించకుంటే సామాజిక అశాంతి: ఐరాస హెచ్చరిక

దేశంలో రోజు రోజుకరూ నిరుద్యోగం పెరిగిపోతోంది. కరోనా కారణంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో కూలీలు ఉపాధికి దూర మయ్యారు. వివిధ రంగాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. లాక్‌డౌన్‌ ప్రభావం అసంఘటిత రంగంపై తీవ్రంగా పడింది.

మార్చి ఒకటో తేదీ నాటికి దేశంలో నిరుద్యోగం 7.91 శాతమే ఉండగా అనేక రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి అది 23.56 శాతానికి చేరుకుంది.

ఏప్రిల్‌ ఒకటో తేదీ నాటికి 9 శాతం ఉన్న నిరుద్యోగం మార్కెట్‌ పరిస్థితులు దిగజారిపోవడంతో 25 రోజుల్లో 14 శాతం నిరుద్యోగం పెరిగింది.

ప్రస్త్తుతం 23.56 శాతం ఉన్న నిరుద్యోగం ఈ నెలాఖరుకు 26 శాతానికి చేరుకుంటుందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ అంచనా వేసింది.

మార్చి ఒకటో తేదీన పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.63 శాతం ఉంటే ఏప్రిల్‌ 25వ తేదీ నాటికి 25.46 శాతానికి చేరుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 7.58 శాతం నుంచి 22.71 శాతానికి పెరిగింది.

మార్చి 22న ప్రకటించిన లాక్‌డౌన్‌ ప్రభావం ఆ నెలలో కనిపించకపోయినా వారం రోజుల తర్వాత ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తన ప్రభావాన్ని భారీగా చూపింది.

రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోవడంతో పలు రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో నిరుద్యోగం పెరుగుతూ వచ్చింది.

ఏప్రిల్‌ మొదటి వారంలో పెరుగుదల సాధారణంగా ఉన్నా రెండో వారంలో పెరుగుదల ఎక్కువవుతూ వచ్చింది. మూడో వారం గడిచేసరికి 23.56 శాతానికి చేరింది. సర్వీసు సెక్టార్‌ నిలిచిపోయింది. ఐటీ రంగం, రియల్‌ ఎస్టేట్‌ ఆగిపోయింది.

హౌస్‌హోల్డ్‌ సేవలు నిలిచిపోయాయి. భవన నిర్మాణ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. అగ్రికల్చర్‌ కొంత కొనసాగు తున్నా లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగానే పడింది. రాష్ట్రంలో 50 శాతం కార్మికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారున్నారు.

అసంఘటిత రంగంలో దినసరి వేతన కూలీలు, ప్లంబర్స్‌, వెల్డర్స్‌, ఎలక్ట్రీషియన్‌ రంగాల్లోని వారికి పనే లేదు. వాటన్నిం టిని ఎలా పునరుద్ధరిస్తారనేదే ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద సవాలే.

అన్నింటికంటే మెజారిటీ కార్మికులు, ఉద్యోగులున్న అసంఘటిత రంగాన్ని ముందుగా రివైవ్‌ చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో అందుకు ఉపాధి హామీ లాంటి కార్యక్రమం చేపట్టాలి. ధాన్యం నిల్వలు అధికంగా ఉన్నందున పనిచేసిన వారికి వాటిని పంపిణీ చేయాలి.

ఇక తెలంగాణలో లేబర్‌ పార్టిసిపేషన్‌ రేట్‌ (ఎల్‌పీఆర్‌) గతేడాది డిసెంబర్‌ మధ్యలో 53.44 ఉండగా, నిరుద్యోగం రేట్‌ 2.30 శాతంగా ఉంది.

అది మార్చి చివరి నాటికి 5.8 శాతానికి పెరిగింది. అయితే దేశంలో నిరుద్యోగం రేటు ఏప్రిల్‌ 1 నుంచి 25 రోజుల్లోనే అంతకుముందు ఉన్నదానిపై 14 శాతం పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగం రేట్‌ యావరేజ్‌గా 15 శాతం వరకు వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో గత డిసెంబరులో ఎల్‌పిఆర్‌ 43.13 శాతం ఉండగా, యూఈఆర్‌ 4.22 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీఆర్‌ 60.61 శాతం ఉండగా యూఈఆర్‌ 1.35 శాతంగా ఉంది. సుదీర్ఘ లాక్‌డౌన్‌తో దేశంలో కార్మిక భాగస్వామ్యం తగ్గిపోయింది.

దినసరి వేతన కూలీలు, భవన నిర్మాణ కార్మికుల ఉపాధిఅవకాశాలు పూర్తిగాదెబ్బతిన్నాయి. సేవా రంగంలోనూ పనులు లేకుండా పో యాయి.

దీంతో కార్మిక భాగస్వామ్యం రేటు 41.96 శాతం నుంచి 35.01 శాతానికి పడి పోయింది. ఉద్యోగ, ఉపాధి రేటు కూడా భారీగా పడిపోయింది.

మార్చి ఒకటో తేదీ నాటికి ఉపాధి 39.84 కోట్ల మందికి ఉంటే ఏప్రిల్‌ 19 నాటికి 27.07 కోట్ల మందికే ఉపాధి ఉన్నట్లుగా తేల్చింది. అంటే దేశంలో కార్మికులు, చిన్న ఉద్యోగులు 12.77 శాతం మంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోయారు.

ప్రపంచ వ్యాప్తంగా 47 కోట్ల మంది నిరుద్యోగులు, చిరుద్యోగులున్నారని, అర్హులకు సరైన ఉద్యోగం కల్పించకపోతే అది సామాజిక అశాంతికి దారి తీస్తుందని ఐక్యరాజ్యసమితి విధాన నిర్ణేతలను హెచ్చరించింది.

గత దశాబ్దంతో పోలిస్తే ప్రపంచ నిరుద్యోగ రేటు నిలకడగానే సాగుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక పేర్కొంది.

నిరుద్యోగ రేటు 5.4 శాతం కొనసాగుతున్నా ఆర్థిక మందగమనంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల సంఖ్య మాత్రం కుదించుకుపోతోందని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇక 2019లో 18.8 కోట్ల మంది నిరుద్యోగులుగా నమోదు చేయిం చుకోగా, ఈ ఏడాది వారి సంఖ్య 19.5 కోట్లకు ఎగబాకుతుందని ఐఎల్‌ఓ తన వార్షిక తన వార్షిక నివేదికలో పేర్కొంది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 28.5 కోట్ల మందికి అన్ని అర్హతలున్నా అరకొర వేతనాలతో చిరుద్యోగులుగానే బతుకుతున్నారని తెలిపింది.

ప్రపంచంలో 60 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పని చేస్తున్నారని వీరంతా చాలీచాలని జీతాలతో కనీస సాంఘిక రక్షణలు లేకుండా పనిలో నెట్టుకొస్తున్నరని ఐఎల్‌ఓ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

దేశీయ ఔషధరంగానికి కోవిడ్‌- 19 దెబ్బ పడింది. ఎగుమతుల అంచనా తప్పింది.

2019- 20లో భారత్‌ నుంచి రూ.1,65,000 కోట్ల్ల విలువైన ఔషధ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయని ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మెక్సిల్‌) గతంలో అంచనా వేసింది. వాస్త్తవానికి రూ.1,54,350 కోట్ల విలువైన మందులు ఎగుమతి అయ్యాయి.

మొత్తం ఎగుమతుల్లో 72 శాతంగా ఉన్న డ్రగ్‌ ఫార్ములేషన్స్‌, బయలాజికల్స్‌ 9.5 శాతం వృద్ధి సాధించాయి.

రెండవ అతిపెద్ద విభాగమైన బల్క్‌ డ్రగ్స్‌, డ్రగ్‌ ఇంటర్మీడియేట్స్‌ 0.73 శాతం తిరోగమన బాట పట్టాయి. 32.74 శాతం వాటా దక్కించుకున్న యూఎస్‌ఏకు ఎగుమతులు 15.8 శాతం అధికమై రూ.50,250 కోట్లకు చేరుకున్నాయి.

కొవిడ్‌ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపించనుంది. వైరస్‌ విస్తరించకుండా నివారణ చర్యల్లో భాగంగా మూడువారాల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ (మూసివేత)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిం ది.

దీనివల్ల 120 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9 లక్షల కోట్లు) మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బ్రిటిష్‌ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది. ఇది భారత జీడీపీలో 4 శాతానికి సమానమని పేర్కొంది.

మూడు వారాల లాక్‌డౌన్‌ వల్ల నష్టమే 90 బిలియన్‌ డాలర్లు ఉంటుందని, దీనికి అంతకుముందే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ప్రభావం అదనమని వివరించింది.

అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి అంచనాలను 1.7 శాతం మేర తగ్గించి 3.5 శాతంగా ఉంటుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో బార్‌క్లేస్‌ పేర్కొంది. ద్రవ్యలోటు 5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.

లాక్‌డౌన్‌ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రతికూల ప్రభావం చూపుతుందని కేర్‌ రేటింగ్స్‌ తాజా నివేదికలో అంచనా వేసింది. 21 రోజుల్లో ఆర్థిక వ్యవస్థలో నిత్యావసర సేవలు, వ్యవసాయరంగం (20% ఉత్పత్తి) మినహా 80 శాతం ఉత్పత్తి నష్టం జరుగుతుందని వివరించింది.

ఆర్థిక వ్యవస్థకు రోజుకు రూ.35,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని విశ్లేషించింది.

మొత్తంగా 6.3 లక్షల కోట్ల నుంచి రూ.7.2 లక్షల కోట్ల వరకూ ఎకానమీ దెబ్బ తింటుందని అంచనా వేసింది.ఆర్థికసంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి- మార్చి)మైనస్‌లోకివెళ్లే అవకాశం లేదుకానీ, 1.5-2.5శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది.

  • ఇస్కా అనిత

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/