ఏపీలో వాలంటీర్ల జీతం పెంపుః మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

జనవరి 1 నుంచి రూ.750 పెంచుతున్నట్లు ప్రకటన

increased the salary of volunteers in AP says Minister Karumuri Nageswara Rao

తిరుమలః ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తరఫున ఇంటింటికీ సేవలందిస్తున్న వాలంటీర్లకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచి వాలంటీర్ల జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు కానుకగా మంత్రి ఈ ప్రకనట చేశారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కారుమూరి.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు కానుకగా వాలంటీర్ల జీతం అదనంగా రూ.750 పెంచనున్నట్లు మంత్రి కారుమూరి చెప్పారు. పెంచిన వేతనాన్ని వాలంటీర్లు వచ్చే నెల 1 నుంచే అందుకుంటారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై మంత్రి విమర్శలు గుప్పించారు. వారిద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో జగన్ పాలన పోవాలని అంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుండగా.. ప్రతిపక్ష నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్ మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేస్తారని మంత్రి కారుమూరి ధీమా వ్యక్తం చేశారు.