మహారాష్ట్రలో అజిత్‌ను కట్టప్పతో పోలిస్తూ పోస్టర్లు

అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీలో చీలిక

In NCP Control Fight, Sharad Pawar Camp Sees A Katappa-Baahubali Parallel

ముంబయిః మహారాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి కట్టప్ప పోలిక వైరల్ అవుతోంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌‌ను బాహుబలిగానూ, చీలిక వర్గం నేత అజిత్‌ పవార్‌‌ను కట్టప్పగానూ పోలుస్తూ పోస్టర్లు వెలిశాయి. తన చిన్నాన్న శరద్‌ పవార్‌‌పై అజిత్‌ పవార్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. బిజెపి షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి.. ఉప ముఖ్యమంత్రిగా చేరారు. నిన్న రెండు వర్గాలు వేర్వేరు సమావేశాలు నిర్వహించగా.. అజిత్ పవార్ మీటింగ్‌కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వెళ్లారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని శరద్ పవార్ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు పోస్టర్లను ఏర్పాటు చేశారు. బాహుబలి సినిమాలో వెన్నుపోటు సీన్‌ను పోస్టర్‌‌పై ముద్రించారు. నీడలోనూ ఇద్దరి రూపాలు తెలిసేలా కట్టప్ప బాహుబలి ఫొటోలు ఏర్పాటు చేశారు. ‘‘ద్రోహులు మన మధ్య దాగి ఉన్నారనేది దేశం మొత్తం చూస్తోంది. ఇలాంటి మోసగాళ్లను ప్రజలు క్షమించరు” అని దానిపై ఎన్సీపీ విద్యార్థి విభాగం నేతలు రాసుకొచ్చారు. గద్దర్ (ద్రోహి) పేరుతో హ్యాష్‌ట్యాగ్ ఏర్పాటు చేశారు.