నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు

imd-predicts-rains-in-telangana-for-three-days

హైదరాబాద్‌ః తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. దీంతో శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.