నేను హిందువుని, కావాలంటే గొడ్డు మాంసం తింటాను : సిద్ధరామయ్య

గొడ్డు మాంసం తినడంపై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య గొడ్డు మాంసం విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని ప్రకటించడమే కాకుండా, కావాలంటే గొడ్డు మాంసం తింటానని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. కర్ణాటక ప్రభుత్వం గొడ్డు మాంసం విక్రయాలపై నిషేధం విధించగా.. సిద్ధరామయ్య తన వ్యాఖ్యలతో దీనిపై చర్చకు దారితీశారు.

‘‘నేను హిందువును. ఇప్పటి వరకు గొడ్డు మాంసం తినలేదు. కానీ, నేను తినాలని భావిస్తే తింటాను. నీవు ఎవరు నన్ను ప్రశ్నించడానికి?” అని తుమకూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సిద్ధరామయ్య అన్నారు. మతాల మధ్య అడ్డుగోడలు కడుతుందంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తీరును తప్పుబట్టారు. ముస్లింలు మాత్రమే గొడ్డు మాంసం తింటారా? అని ప్రశ్నించారు.

‘‘గొడ్డు మాంసం తినేవారు కేవలం ఒక మతానికే పరిమితం కాలేదు. హిందువులు కూడా తింటారు. క్రిస్టియన్లు తింటారు. కర్ణాటక అసెంబ్లీలోనూ నేను ఒకసారి ఇదే చెప్పాను. గొడ్డు మాంసం తినొద్దని చెప్పడానికి నువ్వు ఎవరు?’’ అని ఆయన ప్రశ్నించారు. 2021 జనవరిలో కర్ణాటక ప్రభుత్వం పశువుల వధ నిషేధం, పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని కింద అన్ని రకాల పశువుల కొనుగోలు, విక్రయాలు, రవాణా, వధ నిషేధం. ఆవులు, ఎద్దులు, గేదెలు అన్నీ ఈ చట్టం కిందకు వస్తాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/