కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు దోచుకుంటుందిః ప్రధాని మోడి

If the Congress party came to power, it will loot people’s property: PM Modi

న్యూఢిల్లీః ప్రజలను దోచుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, చనిపోయిన వారిని కూడా దోచుకోవాలనే ఆలోచనలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈమేరకు ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజాలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ బుధవారం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు దోచుకుంటుందని తాను చెప్పిన మాటలు నిజమని ఆ పార్టీ నేతలే పరోక్షంగా నిర్ధారిస్తున్నారని అన్నారు. ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని ఒక్కొక్కటిగా నేతలు బయటపెడుతున్నారని వివరించారు. నిజాలు బయటపడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలను ఉదాహరిస్తూ.. బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని దోచుకుంటుంది, చనిపోయాక కూడా మీ ఆస్తులను కాజేస్తుందని మోడీ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఎల్ఐసీ కంపెనీ స్లోగన్ ను మోదీ ప్రస్తావించారు. ‘జిందగీ కే సాత్ భీ, జిందగీ కే బాద్ భీ’ అన్నట్లు మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును ట్యాక్స్ ల రూపంలో కాంగ్రెస్ లాక్కుంటుందని చెప్పారు. చనిపోయాక మీరు మీ కుటుంబ సభ్యులకు వదిలి వెళ్లే ఆస్తులను ఎలా కాజేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు అర్థమవుతోందని ఆరోపించారు. ఆ పార్టీ సీనియర్ నేత (శామ్ పిట్రోడా పేరు ప్రస్తావించకుండానే) వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని మోడీ చెప్పారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును తమ పిల్లలకు అప్పజెప్పే వీలులేకుండా చేయాలనుకుంటోందని కాంగ్రెస్ పార్టీపై మోడీ ధ్వజమెత్తారు. ‘బతికున్నపుడు కాంగ్రెస్ విధించే పన్నులు చెల్లించలేక మీరు ఇబ్బంది పడతారు.. చనిపోతూ మీరు వదిలివెళ్లిన ఆస్తులపై పన్నులు చెల్లించలేక మీ పిల్లలు అవస్థ పడాల్సి వస్తుంది’ అని మోడీ హెచ్చరించారు.

కాగా, అమెరికాలో అమలవుతున్న వారసత్వ పన్నును కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మెచ్చుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వదిలి వెళ్లే ఆస్తులపై అమెరికా వారసత్వ పన్ను విధిస్తోందని పిట్రోడా చెప్పారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా అందుకునే సొమ్ములో సగభాగం ప్రభుత్వానికి చెందుతుందని వివరించారు. అంటే.. వారసత్వంగా వచ్చే ప్రతీ వంద డాలర్లలో దాదాపు 55 డాలర్లను వారసత్వ పన్ను కింద ప్రభుత్వం తీసేసుకుంటుందని, మిగతా 45 డాలర్లు మాత్రం పిల్లలకు దక్కుతుందని తెలిపారు. ఈ పద్ధతి న్యాయంగా ఉందని తాను భావిస్తున్నట్లు శామ్ పిట్రోడా వెల్లడించారు.