నాపై ఒక్క ఆరోపణ రుజువైన ఉరి వేసుకుంటా: చీఫ్ బ్రిజ్ భూషణ్

న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలని గత కొన్నాళ్ల నుంచి మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తనపై వచ్చిన ఆరోపణలను తాజాగా మరోసారి కొట్టిపారేశారాయన. తనపై వచ్చిన ఆరోపణల్లో.. ఒక్కదాన్ని నిరూపించినా.. తాను ఉరివేసుకోనున్నట్లు బ్రిజ్ భూషణ్ తెలిపారు. మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే, వాటిని కోర్టుకు సమర్పించాలని, శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
బ్రిజ్‌పై వస్తున్న ఆరోపణలకు చెందిన ఆధారాలు లేవని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రాజకీయవేత్తను అరెస్టు కోసం వారెంట్ జారీ చేయాలన్నా.. సరైన ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు. మరో 15 రోజుల్లోగా దర్యాప్తునకు చెందిన రిపోర్టును కోర్టుకు సమర్పించనున్నామని తెలిపారు. ఛార్జ్‌షీట్ లేదా ఫైనల్ రిపోర్టు తరహాలో ఆ నివేదికను కోర్టుకు ఇవ్వనున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఈ కేసును ఇంకా విచారిస్తున్నామని పోలీసులు తమ ట్విట్టర్‌లో వెల్లడించారు.
కాగా, ఒలింపిక్ మెడల్ గ్రహీతలు సాక్షీ మాలిక్, భజరంగ్ పూనియాతో పాటు ఆసియా గోల్డ్‌మెడల్ గ్రహీతలు వినేశ్ పోగట్.. జనవరి నుంచి బ్రిజ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది మహిళా అథ్లెట్లను బ్రిజ్ లైంగికంగా వేధించినట్లు ఆ సీనియర్ రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. మంగళవారం హరిద్వార్‌లో తమ పతకాలను గంగలో వేద్దామనుకున్నా.. రైతు నేత నరేశ్ టికాయత్ అడ్డుకోవడంతో ఆ కార్యక్రమాన్ని విరమించారు. రేపు యూపీలోని ముజాఫర్‌నగర్ జిల్లాలోని సౌరమ్ గ్రామంలో టికాయత్ నేతృత్వంలో జరగనున్న కాప్ పంచాయతీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.