హెలికాప్ట‌ర్ ప్రమాదం..కెప్టెన్‌ వ‌రుణ్ సింగ్ మృతి

క‌న్నుమూశారని భార‌త వాయుసేన అధికారిక ప్ర‌క‌ట‌న‌

న్యూఢిల్లీ: తమిళనాడులో ఈ నెల 8న‌ జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య‌ మధులికా రావత్ స‌హా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్ర‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డి ఇన్నిరోజులుగా బెంగ‌ళూరులోని క‌మాండ్ ఆసుప‌త్రిలో ప్రాణాల‌తో పోరాడిన కెప్టెన్ వ‌రుణ్ సింగ్ క‌న్నుమూశారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని గంట గంట‌ల‌కూ వైద్యులు ప‌ర్య‌వేక్షించి మెరుగైన చికిత్స అందించిన‌ప్ప‌టికీ ప్రాణాలు కాపాడ‌లేక‌పోయారు. కెప్టెన్ వ‌రుణ్ సింగ్ మృతిని భార‌త వాయుసేన అధికారికంగా ప్ర‌క‌టించింది.

‘ఈ నెల 8న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో గాయాల‌పాలై ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న కెప్టెన్ వ‌రుణ్ సింగ్ ఈ రోజు ఉద‌యం ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు భార‌త వాయుసేన సంతాపం తెలుపుతోంది’ అని భార‌త వాయుసేన ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఆయ‌న కుటుంబానికి అండ‌గా నిలుస్తామ‌ని చెప్పింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/