ఢిల్లీ లిక్కర్ స్కాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు – ఎంపీ మాగుంట శ్రీనివాసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పలువురు పేరులు బయటకొచ్చాయి. విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు అందాయని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ తెలిపింది. ఇప్పటికే కవిత మీడియా తో స్పందించడం జరిగింది.

రిమాండ్‌ రిపోర్టులో ఈడీ పేర్కొన్న అంశాలు.. దానికి సంబంధించిన పరిణామాలపై ఆమె మాట్లాడారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. మోడీ కంటే ముందు ఈడీ వస్తుందని ఆమె దుయ్యబట్టారు. వచ్చే ఏడాది డిసెంబరులో ఎన్నికలు ఉన్నందునే ఈడీ కేసులు పెడుతున్నారన్నారు. బీజేపీ నీచమైన ఎత్తుగడతో తనపైనా టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలపైనా ఈడీ కేసులు పెడుతుందని ఆక్షేపించారు.

మరోపక్క ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం లిక్కర్ స్కామ్ లో తన పేరు బయటకు రావడం ఫై స్పందించారు. లిక్కర్ స్కాంలో తన పేరు చేర్చడంతో ఆశ్చర్యపోయానని ఆయన వెల్లడించారు. గతంలో తాము మద్యం వ్యాపారాలు చేసిన మాట వాస్తవమేనని, అయితే, ఆ వ్యాపారాలను మానేసి చాలాకాలం అయిందని వివరించారు. ప్రస్తుతం వెలుగు చూసిన స్కాంలో అమిత్ అరోరా పాత్ర కీలకమని ఈడీ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, అమిత్ అరోరా అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని మాగుంట తేల్చిచెప్పారు. అతనితో కనీసం తనకు ముఖ పరిచయం కూడా లేదన్నారు.