తెలంగాణ అసెంబ్లీ వద్ద 144 సెక్షన్‌ అమలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ వద్ద 144 సెక్షన్ ను అమలు పరిచారు. అసెంబ్లీ చుట్టూ 4 కిలోమీటర్ల మేర 144 సెక్షన్ విధించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, గుంపులుగా వెళ్లడంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. సమావేశాలు ముగిసే వరకు ఆంక్షలు ఉంటాయని… అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు జరిగే చిట్టచివరి సమావేశాలు కావడం తో సమావేశాల ఫై అందరిలో ఆసక్తి నెలకొంది.

అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో అధికార బీఆర్ఎస్​తో పాటు విపక్షాలైన కాంగ్రెస్‌, భాజపాలు కూడా కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. ఈసారి సభాపర్వంలో కూడా ఆ వేడి, వాడి కనిపించనుందని తెలుస్తోంది. ఆర్టీసీ విలీన బిల్లు, గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవల మంత్రివర్గం ఆమోదించగా.. దీనికి సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్‌ తిప్పి పంపిన బిల్లులను కూడా తిరిగి సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లులపై చర్చించి, వీటి ప్రాముఖ్యాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు.