నగరంలో రోడ్ల పరిస్థితి చూసి అధికారులపై మండిపడ్డ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి

హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్ వారు రోడ్లు తవ్వుతారో చెప్పలేం. ఈరోజు రోడ్ వేస్తే..వారం రోజుల్లో తవ్వేస్తారు. ఇక వర్షాలు పడితే అంతే సంగతి. గజానికో గొయ్యి ఉంటుంది. ఈ గొయ్యిలో ప్రయాణం చేస్తూ ప్రతి రోజు వాహనదారులు పదుల సంఖ్య లో కింద పడుతుంటారు. ప్రస్తుతం నగరంలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు పడేసరికి రోడ్లన్నీ పాడైపోయాయి. ఈ రోడ్ల ఫై ప్రయాణం చేయాలంటే చావుకొస్తుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో రోడ్ల పరిస్థితి చూసి అధికారులపై మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి మండిపడ్డారు. వరద ప్రభావ ప్రాంతాల్లో అందుతున్న సహాయ చర్యలను పరిశీలించేందుకు బుధవారం మేయర్‌ అంబర్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్‌ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది. కార్లలో మెయిన్‌ రోడ్లమీదే తిరుగుతాం. గల్లీల్లో, బస్తీల్లో ప్రజల బాధలు తెలియాలంటే మోటార్‌సైకిళ్లపై వెళ్లండి. క్షేత్రస్థాయిలో వర్షాల వల్ల ఎన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి.. ఎక్కడ ఎన్ని గుంతలు పడ్డాయి.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది క్లియర్‌గా తెలుస్తుంది’ అని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. రోడ్లపై గుంతలు తదితరమైన వాటికి తక్షణం మరమ్మతులు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల్లో నిల్వనీటిని తొలగించడంతోపాటు సదరు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణచర్యలు చేపట్టాలన్నారు.