రెండు రోజులపాటు హైదరాబాద్ లో వైన్ షాప్స్ బంద్..

Wine Shops
Wine Shops

గణేష్ నిమజ్జనం సందర్బంగా మద్యం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం (సెప్టెంబర్ 9) ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రేపు, ఎల్లుండి మద్యం దుకాణాల మూసివేస్తారని తెలిసి మద్యం ప్రియులు పెద్ద సంఖ్యలో వైన్ షాప్స్ కు క్యూ కట్టారు. రెండు రోజులకు సరిపడా మద్యాన్ని తీసుకొని వెళ్లారు.

ఇక గణేష్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసారు. మెట్రో సైతం ట్రైన్ల సమయాన్ని పొడిగించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. నిమజ్జనం సందర్బంగా రేపు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. శుక్రవారానికి బదులుగా ఈ నెల 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్ లో రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. శుక్రవారం, శనివారం జరగనున్న గణేష్ శోభాయాత్రకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక వినాయక విగ్రహాల ఊరేగింపు జరిగే ప్రాంతాలు, నిమజ్జనం జరిగే ట్యాంక్ చుట్టుపక్కల రోడ్లను మూసివేస్తున్నారు. సెప్టెంబరు 9,10 రోజుల్లో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో రహదారులు మూతపడనున్నాయి.