కర్ణాటకలోని సింధనూరులో ఘోర రోడ్డుప్రమాదం : హైదరాబాద్ వాసులు మృతి

కర్ణాటకలోని సింధనూరులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో హైదరాబాద్ మేడ్చల్ కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు మృతి చెందారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి క్రాంతినగర్‌ కాలనీలో ప్రదీప్‌ సక్సేనా(35), పూర్ణిమ(33) దంపతులు నివసిస్తున్నారు. వీరికి జతిన్‌(12), మోహిన్‌ (7) సంతానం. పూర్ణిమా స్థానికంగా ఉన్న సిల్వర్‌ ఓక్స్‌ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మూడేళ్లుగా ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తుండగా, ప్రదీప్ ప్రైవేటు ఉద్యోగి. మోహిన్‌ తల్లి పనిచేస్తున్న స్కూల్లోనే మూడో తరగతి చదువుతోంది.

కాగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం స్కూల్స్ కు హాలిడేస్ ఇవ్వడం తో..వీరంతా సొంత కారులో విహారయాత్రకు వెళ్లారు. సోమవారం కర్ణాటకలోని సింధనూరు పట్టణం దాటి హైదరాబాద్‌ వైపు వస్తుండగా.. వీరి కారును రాయచూరు నుంచి ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నుజ్జనుజ్జు కావడంతో అందులో చిక్కుకున్న మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీయాల్సి వచ్చింది. స్థానిక పోలీసులు మృతదేహాలను సింధనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరారైనట్లు పోలీసులు తెలిపారు.