ఇకపై ఇంటి వద్దకే రేషన్ సరఫరా : సీఎం భ‌గ‌వంత్ మాన్

పంజాబ్: పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ మ‌రో నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఇకపై రేష‌న్ కోసం ఎవరూ క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు.. దీని కోసం సెలవు పెట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఇలాంటి కష్టాలు ఇకపై ఉండకుండా.. నాణ్యమైన రేషన్ ను ఇంటి వద్దకే సరఫరా చేయనున్నామని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు ఈ పథకం ఆప్షనల్ మాత్రమేనని, ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అధికారులే లబ్దిదారులకు ఫోన్ చేసి మీకు అనువైన సమయంలో వచ్చి సరుకులు అందచేయడం జరుగుతుందని, ఎవరికైనా రేషన్ డిపో దగ్గరిలోనే ఉంటే… వారు వెళ్లి తెచ్చుకోవచ్చన్నారు. సీఎం భగవంత్ మాన్ తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. పంజాబ్ సీఎం ప్రకటన ఎంతో గొప్పదని, ఇది పేద ప్రజలకు మేలు చేస్తుందన్నారు. ఢిల్లీలో ఈ పథకం అమలు చేయాలని ప్రయత్నిస్తే.. కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. పంజాబ్ లో ఈ పథకం అమలైతే ఇతర రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తాయన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/