రోడ్డు ప్రమాదాలకు దారులుగా దేశ రహదారులు!

87 శాతం 13 రాష్ట్రాల్లోనే!

Road Accident
Road Accident

రహదారులు ప్రగతికి ప్రతీకలని, నాగరికతకు ప్రతిబింబాలని అనడం సర్వసాధారణం. ఆచరణలో చూస్తే మృత్యువుకి మార్గాలని, నరకానికి దగ్గరదారులని అర్థమవుతుంది. ఆప్ఘనిస్థాన్‌, చైనాలను మించిన ప్రమాదకర ప్రాంతాలు దేశంలోనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

ప్రపంచం మొత్తం మీద భారత దేశంలోనే రెండో అతిపెద్ద రహదారి వ్యవస్థ ఉంది.. 47.2 లక్షల కిలోమీటర్లకుపైగా రోడ్లు విస్తరించి ఉన్నాయి. వాటిలో జాతీయ రహదారుల వాటా 2.1 శాతం. వీటిపై సంభవిస్తున్న ప్రమాదాలు మాత్రం 28 శాతం దాటింది. ప్రపంచంలో ఎక్కడా లేనన్నిరోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య భారత్‌లో ఎక్కువగా ఉన్నాయి. విశ్వవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో బలవుతున్నవారు 12.6 లక్షలకు మించి ఉన్నారు.

భారత్‌లో వీరి సంఖ్య లక్షాయాభైవేలు దాటడం ఆందోళన కలిగించే అంశం. క్షతగాత్రుల సంఖ్య దానికి నాలుగింతలు ఉంటుంది. దేశంలో ప్రతిరోజూ సగటున రోడ్డు ప్రమాదాలలో 400 మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వీరిలో అత్యధికులు రేపటి పౌరులే ఉంటున్నారు. రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో 54 శాతం యువతేనని, ప్రమా దాల వల్ల 60వేల కోట్ల రూపాయల నష్టం కలుగుతుందని ప్రభుత్వమే చెబుతోంది

ఎయిడ్స్‌, కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల వల్ల చనిపోయే వారికంటే రహదారి ప్రమాదాలే యువతను బలి గొంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. స్వీడన్‌ రోడ్డు భద్రత విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా ఉంది. అక్కడ రహదారులు అత్యంత సురక్షితంగా ఉన్నాయి.

భద్రత ప్రమాణాల విషయంలో సర్కార్‌ ఏమాత్రం రాజీపడటం లేదు. స్వీడన్‌లో కార్ల సంఖ్య బాగా పెరిగినప్పటికీ, ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గింది. రహదారుల మీద వేగం కన్న భద్రతకే పెద్దపీట వేయడమే దీనికి కారణంగా కనిపిస్తుంది.

ప్రతి లక్ష జనాభాకు రహదారి మరణాల రేటును మూడు నుంచి నాలుగుకు పరిమితం చేయడంలో స్విట్జ ర్లాండ్‌, నెదర్లాండ్‌, మాల్దీవ్ఞలు, డెన్మార్క్‌, సింగపూర్‌, ఇజ్రాయెల్‌ పోటీపడుతున్నాయి. చిన్న పిల్లలకు రహదారి భద్రత పరికల్పనలో దక్షిణ కొరియా విశ్వానికే విశిష్ట నమూనాగా ఉంది. 1992 నుండి అక్కడ పధ్నాలుగు సంవత్సరాలలోపు బాలల మరణాలను 97 శాతం నివారించారంటే అక్కడి ప్రభుత్వ చిత్తశుద్ధికి దర్పణంగా నిలుస్తుంది.

మత్తుపదార్థాల వినియోగంపై ఆంక్షలు అమలు, సీటు బెల్టులు ధరించి కారు నడపడం, మొదలైన విషయాలలో అంటి అంటనట్టు ఉండకుండా చైనా చాలా కఠినంగా ఉంటుంది. అదికాదాయ దేశాలతో పోలిస్తే దిగువ మధ్యాదాయ దేశాలలోనే రహదారి ప్రమాదాలలో అసువ్ఞలు బాసినవారు ఎక్కువగా ఉన్నా రని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.

అంతేకాదు 80 శాతం దేశాలలో విక్రయిస్తున్న వాహనాలు మౌలిక భద్రతా ప్రమాణాలకు తగినట్టుగా లేవని, 130 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నా కేవలం 44 దేశాలలోనే హెల్మెట్‌ధారణ చట్టాలున్నాయని తెలియ చేసింది.

భారతదేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 87 శాతం 13 రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్నాయి. దీనిలో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానం, తెలంగాణ తొమ్మిదోస్థానం పొందాయి. వాహనాల సంఖ్య గణనీయంగా ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఢిల్లీ, ముంబాయి, కోల్‌కత్తా నగరాలలో ప్రాణనష్టాలు తగ్గుముఖం పట్టగా, చెన్నై, బెంగళూరు, జైపూర్‌ హైదరాబాద్‌ నగరాలలో ప్రాణనష్టాలు అధికంగా ఉన్నా యి. 84 శాతం రోడ్డు ప్రమాదాలకు, 80 శాతానికి పైగా అర్థాంతర చావులకు, సుమారు 84 శాతం మేర గాయాలకు వాహన చోదకులు చేస్తున్న పొరపాట్లే కారణంగా కనిపిస్తున్నాయి. చరవాణి

తోనే ముప్పు వస్తుందనేది అనుభవంలో చూస్తున్నాం. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ లేదా సందేశం పంపుతూ వాహనాలు నడపడమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. రోడ్డు భద్రత విషయంలో రాజీపడితే వచ్చే విపత్తును ప్రభుత్వం గుర్తించడం లేదు. చట్టాల అమలులోని లొసుగులు, అధికారుల అవినీతితో అధికశాతం కేసులు బుట్ట దాఖలు అవ్ఞతున్నాయనేది వాస్తవం. రెవెన్యూ, ఎక్సైజ్‌ శాఖలతో పాటు రవాణా వ్యవస్థ కూడా అవినీతికి కేంద్రబిందువుగా ఉంద నేది జగమెరిగిన సత్యం.

ప్రజలలో రోడ్డు భద్రతపై అవగాహన లేమి, మితిమీరిన వేగం, ప్రభుత్వ ఉదాసీనత, చట్టాల అమలులో చిత్తశుద్ధిలోపించడం, డ్రైవింగ్‌ రాకపోవడం, సరిగా చేయక పోవడం, మద్యపానం చేసి వాహనాలను నడపడం, రహదారి డిజైనింగ్‌లో లోపాలు, రోడ్డు నిర్వహణ లోపాలు, ట్రాఫిక్‌ సిబ్బందికి ఆధునిక శిక్షణ లేకపోవడం, కార్లలో ఎయిర్‌బ్యాగ్స్‌ వాడకపోవడం, ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయో గించకపోవడం, మద్యపాన నిషేధాన్ని అమలు చేయకపోవడం మొదలైనవన్నీ కారణాలుగా చెప్పవచ్చు.

సేఫ్‌్‌డ్రైవ్‌, సేవ్‌లైఫ్‌ నినాదం ప్రచారంలో బాగుంది. కాని ఆచరణలో సత్ఫలితాలను ఇవ్వడం లేదు. 2016లో ఆమోదించిన మోటార్‌ వాహనాల చట్టం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయన్నది నిజమనేది అది అమలు జరిగే తీరు మీద ఆధాపడి ఉంది. చరవాణి వినియోగం, శిరస్త్రాణం ధరించకపోవడం, కారు బెల్ట్‌ పెట్టుకోకపోవడం మద్యంతాగడం, అక్రమ లైసెన్స్‌ను కలిగి ఉండటంపై అధికారులు ప్రధానంగా దృష్టి పెడితే మంచి ఫలితాలు ఉంటాయి.

ఏడాది కోసారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నా రోడ్డు మరణాల సంఖ్య తగ్గకపోవడం, ఆందోళనను కలిగించే విషయం.రహదారి భద్రతను గాలికి వదిలేస్తే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలవకుండా ఎలా ఉంటాయి. ప్రభుత్వం ప్రజలు ఆలోచించవలసిన విషయం, అశ్రద్ధ చేయకూడని అంశం. కనీసం ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి.

రోడ్డు ప్రమాదాలను అదుపులోకి తేవాలి. దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తున్న స్వీడన్‌, నెదర్లాండ్‌, ఆస్ట్రియా వంటి ఐరోపా దేశాల స్ఫూర్తిని తీసుకొని ముందుకుపోవాలి.

  • ఆచార్య గిడ్డి వెంకటరమణ

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/