జూబ్లీహిల్స్ లోని పబ్స్ కు హైకోర్టు షాక్..

జూబ్లీహిల్స్ లోని పబ్స్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ ను బంద్ చేయాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సవరించింది. ఈ నిబంధన జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్ లకు మాత్రమే పరిమితమని హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం తీర్పు చెప్పింది. టాట్, జూబ్లీ 800, ఫర్జీ కేఫ్,అమ్నిషియ, హై లైఫ్, డైలీ డోస్, డర్టీ మార్టిని, బ్రాడ్వే, హార్ట్ కప్ పబ్ లలో రాత్రి 10 తర్వాత మ్యూజిక్ కి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇళ్ల మధ్య ఉన్న పబ్బుల కారణంగా అసౌకర్యానికి గురవుతున్నామంటూ జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.

హైదరాబాద్ పరిధిలోని పబ్ లలో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మ్యూజిక్ ను నిలిపివేయాలంటూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ రెస్ట్రోలాంజ్ అసోసియేషన్ లు హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశాయి. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్… సింగిల్ బెంబ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ తీర్పు చెప్పింది.